షాబాద్, మే 12: పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేందర్కుమార్ కటారియాతో కలిసి ఆదివారం సందర్శించారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలో బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేపట్టిన ఎన్నికల సామగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ పరిశీలించారు.
తాగునీటి వసతి, వైద్యశిబిరం, అల్పాహారం, భోజనం వసతి, షామియానాల వంటి ఇతర అన్ని వసతులను పరిశీలించారు. పీవో, ఏపీవో, ఓపీవోలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎంల పనితీరును ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు.
ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందినదా, లేదా అన్నది సరి చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తేవాలని ఆర్.ఓలకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, సహాయక రిటర్నింగ్ అధికారి సాయిరాం, సంబంధిత అధికారులు ఉన్నారు.