బొంరాస్‌పేట, నవంబర్ 27 : అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలో ఏర్పుమళ్ల గ్రామంలో, దుద్యాల మండల కేంద్రంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎంను చూపించి కారు గుర్తుకు ఎలా ఓటు వేయాలో ఓటర్లకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని, ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడి, సంక్షేమం ఆగిపోతుందని అని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చి న హామీలతోపాటు ఇవ్వని అనేక హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. ఆసరా పింఛన్ రూ.5 వేలకు పెంపు, రూ.400లకే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.3 వేల ఆర్థిక సహాయం, రూ.15 లక్షలతో కేసీఆర్ బీమా పథకం వంటి అనేక పథకాలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే సీఎం కేసీఆర్ అమలు చేస్తారని ఓటర్లకు ఆయన వివరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటమ్మ, సర్పంచ్ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దుద్యాలలో మండల ఎన్నికల ఇన్చార్జ్ లింగంపల్లి కిషన్‌రావు, పార్టీ నాయకులు బసిరెడ్డి, కవిత, యూనుస్ తదితరులతో సమావేశమై ఎన్నికల ప్రచారాన్ని సమీక్షించారు. రెండు రోజులపాటు ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించారు.