Farmers | షాద్‌నగర్ రూరల్, మార్చి 24 : గత ప్రభుత్వ హయంలో రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ పెద్దపీట వేయడంతో ప్రతి రైతు కాస్తోకుస్తో కొన్ని పైసాలు వెనుకవేసుకున్నాడు. పెట్టుబడి సాయం కింద సకాలంలో రైతు బంధు, అదే విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా 24గంటల విద్యుత్ సరఫరా, రైతు బీమా, సబ్సిడిపై ట్రాక్టర్లు, పనిముట్లు, మందులు ఇలా ఎన్నో రైతుల కోసం సర్కార్ కృషి చేయడంతో నాడు రైతులు ఎలాంటి అప్పులు చేయకుండా దర్జాగా వ్యవసాయం చేసుకుని నాలుగురూపాయాలను సంపాదించుకున్నారు.
కానీ నేడు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతన్న సంక్షేమాన్ని విస్మరించడంతో రైతులు అప్పుల బాధలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాతకాలం తరహాలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నం అవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మండల రైతులు ఉన్నారు. దీనికి తోడు ఇస్తామన్న రుణమాఫీ కొద్ది మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కేవలం రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా వస్తుండడంతో మళ్లి రైతన్నలు పొలం బాటపడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని రైతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తలనొప్పిగా మారిన విద్యుత్ సమస్య
విద్యుత్ సమస్యలతో మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరి కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలతో రైతులు పొలాల వద్దనే వడిగాపులు కాసే పరిస్థితి దాపరించింది. దీనికి తోడు లోవోల్టెజ్ సమస్యతో బోరు మోటర్లు తరుచు కాలిపోతున్నాయని రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక బోరు మోటర్ రిపేరింగ్ చేయాలంటే సుమారు రూ. 8వేలకు పైగా ఖర్చు ఆవుతుందని, దీంతో మళ్లి అప్పులు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.
నాకు 3 ఎకరాల భూమి ఉంది. విద్యుత్ నిరంతరం కాకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దీనికి తోడు లోవోల్టెజ్‌తో బోరు మోటర్లు కాలిపోతున్నాయి. మూడు నెలల్లో రెండుసార్లు రిపేరింగ్ చేయించా. ఒకసారి రిపేర్ చేస్తే రూ. 8 వేలు ఖర్చు వస్తుంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఉంది. లోవోల్టెజ్ సమస్యను తీర్చి 24 గంటల విద్యుత్‌ను అందించాలి.
-కుమార్, రైతు, కమ్మదనం
మళ్లీ రాత్రి సమయాల్లో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పొలం వద్దకు వెళ్లే పరిస్థితి. ఉదయం సమయాల్లో కరెంట్ లోవోల్టెజ్‌తో వస్తు పోతూ ఉంటుంది. రాత్రి 12 గంటల నుంచి విద్యుత్ సరఫరా వస్తుంది. అందుకే రాత్రి సమయాల్లోనే పంటలకు నీరు పెడుతున్నాం. ఓ వైపు భూగర్జ జలాలు అడుగంటి పోవడం.. మరోవైపు లోవోల్టెజ్ సమస్యతో బోరు మోటార్లు తరుచు కాలిపోతున్నయ్. రైతుల సమస్యలను పరిష్కరించాలి.
-ఆంజనేయులు, రైతు, చిల్కమర్రి