Maha Shivaratri | కడ్తాల్, ఫిబ్రవరి 25: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఏక్వాయిపల్లి ముద్విన్ గ్రామాల శివారులోని మల్లన్నగుట్ట మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మల్లిఖార్జున స్వామి ఆలయంలో బుధవారం నుంచి మార్చి 2వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ధర్మకర్త ఎట్టయ్య యాదవ్ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా ఏటా మల్లన్నగుట్టపై ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఉత్సవాలను తిలకించేందుకు ఏక్వాయిపల్లి, ముద్విన్ ప్రజలతోపాటు, ఆమనగల్లు, మాడ్గుల్ మండలాల ప్రజలు విచ్చేస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
*జాతర ఉత్సవాల వివరాలు*
మల్లన్నగుట్టపై కొలువై ఉన్న మల్లిఖార్జునస్వామి వారి ఉత్సవాల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. బుధవారం ఉదయం పంచామృతాలతో మహాశివునికి అభిషేకం, గణపతి పూజలు, రాత్రికి శివపార్వతుల కల్యాణోత్సవం, 27న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ఆవరణలో అగ్నిగుండాలు, ఒగ్గు కథ. 28న స్వామి వారికి ప్రత్యేక స్వామి వారికి ప్రత్యేక పూజలు, రాత్రికి రథోత్సవం, మార్చి 1న విశేష పూజలు, దీపోత్సవం, ఒగ్గుకథ, 2న ఒగ్గుకథ, చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు వివరించారు.