రంగారెడ్డి / పరిగి : బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా మిగతా విద్యాసంస్థలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ తరగతులను కూడా నిర్వహించేందుకు నిర్ణయించింది. విద్యాశాఖ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు 25 నుంచి 30 వరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పారిశుధ్య పనులు నిర్వహించి, చెత్తాచెదారాన్ని తొలగించారు. శానిటైజ్ చేయించారు. తరగతి గదిలోనూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు అందజేయనున్నారు. మంత్రి సబితారెడ్డి సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు మాస్కుల చొప్పున పంపిణీకి ఇప్పటికే ఆయా పాఠశాలలకు అందజేశారు.
కొవిడ్ నిబంధనలతో ప్రత్యక్ష తరగతులు
ప్రతి విద్యార్థి మాస్కులు ధరించడం, శానిటైజ్ వాడేలా అవగాహన కల్పించనున్నారు. ప్రతి తరగతి గది వద్ద విద్యార్థులు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్ తరగతులను కూడా నిర్వహించనున్న దృష్ట్యా తల్లిదండ్రుల ఇష్టం మేరకు తరగతులను నిర్వహిస్తారు. ఏ విద్యార్థి అయినా అస్వస్థతకు గురైనట్లయితే వెంటనే చికిత్స అందించడంతోపాటు కొవిడ్ పరీక్ష నిర్వహించాలని, కొవిడ్ పాజిటివ్ అని తేలితే మిగతా విద్యార్థులకు పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలలో సిక్ రూంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరైనా విద్యార్థికి జ్వర లక్షణాలు కనిపించినట్లయితే సిక్ రూంలో ఉంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ తరగతులు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా కొనసాగుతాయి.
రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1351 ఉండగా 1.50 లక్షల మంది విద్యార్థులున్నారు. వికారాబాద్ జిల్లాలో 1071 ప్రభుత్వ, 184 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 90వేల మంది విద్యార్థులుండగా.. ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 25వేల మంది ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 5,54,000 పాఠ్యపుస్తకాలను ఆయా పాఠశాలలకు చేరవేసింది. దీంతో చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. పాఠశాలలను ఇటీవల కలెక్టర్లు, విద్యాశాఖ, ఇతర అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.