రంగారెడ్డి, మే 6 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాల్లోనే అతి పెద్దదైన బాటసింగారం పండ్ల మార్కెట్ సమస్యలకు నిలయంగా మారింది. తెలుగు రాష్ర్టాల నుంచి సీజన్లో ప్రతిరోజూ సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల వాహనాల్లో మామిడి కాయలు ఇక్కడికి వస్తుంటాయి. కేవలం 12 ఎకరాల్లోనే క్రయవిక్రయాలు జరుగుతుండడంతో చాలామంది వ్యాపారులు, రైతులు తమ మామిడికాయలను మండుటెండలోనే అమ్మడం, కొనడం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాహనాలను నిలిపేందుకు ఉన్న షెడ్లు ఏమాత్రం సరిపోవడంలేదు. అంతేకాకుండా రైతులు, వాహన డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని అలాగే, తాగునీరు అందడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలల పాటు..
బాటసింగారం పండ్ల మార్కెట్లో ప్రతి ఏటా మామిడి సీజన్లో మూడు నెలల పాటు క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయి. గతేడాది 1,40,000 మెట్రిక్ టన్నుల మామిడి క్రయవిక్రయాలు జరుగగా.. ఈ ఏడాది ఇప్పటికే 68,000 మెట్రిక్ టన్నుల మామి డి అమ్మకం, కొనుగోళ్లు జరిగాయి. ఈసారి కూడా సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మామిడి క్రయవిక్రయాలతో ప్రతిఏటా మార్కెట్‌కు రూ. రెండు నుంచి రూ.మూడు కోట్ల వరకు ఆదా యం సమకూరుతున్నా.. మార్కెట్‌కు వచ్చే రైతులు, కొనుగోలుదారులు, వాహన డ్రైవర్లకు మౌలిక వసతులు కల్పించడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాటసింగారం పండ్ల మార్కెట్‌ను అద్దె స్థలంలో నిర్వహిస్తున్నారు. సరైన స్థలం లేకపోవటంతో మామిడి క్రయవిక్రయాలకు కేవలం 12 ఎకరాలను మాత్రమే కేటాయించారు. ఈ స్థలమూ సరిపోకపోవడంతో చాలామంది రైతులు తమ పంటను ఆరుబయట ఎండలోనే విక్రయించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
అన్నదాతకు దక్కని మద్దతు ధర
బాటసింగారం పండ్ల మార్కెట్‌కు ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట తదితర ప్రాంతాల నుంచి 90 శాతం వరకు మామిడి దిగుబడి వస్తుంది. అలాగే, ఏపీలోని అనంతపురం మరికొన్ని ప్రాంతాల నుంచి 10 శాతం వరకు వస్తుంది. ఎంతో ఆశగా పంటను మార్కెట్‌కు తీసుకొస్తే సరైన గిట్టుబాటు ధర రాడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను నిర్ణయిస్తున్నారని.. ఆ రేట్ ఎంతమాత్రం సరిపోవడంలేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. తరుగు పేరుతో టన్నుకు క్వింటాల్ చొప్పున అదనంగా మామిడి కాయలు తీసుకుంటున్నారని దీనిని అధికారులు అరికట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. వ్యాపారులు నిర్ణయించిన ధరకే తమ మామిడి కాయలను అమ్మాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. క్వింటాల్‌కు రూ. మూడువందల నుంచి రూ. నాలుగువందల వరకు మాత్ర మే ఇస్తున్నారని ఇది ఏమాత్రం సరిపోవటంలేదని వాపోతున్నారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

కనీస సౌకర్యాలు నిల్..
బాటసింగారం పండ్ల మార్కెట్‌కు ప్రతిరోజూ వేలాది మంది రైతులు, వ్యాపారులు వచ్చి వెళ్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు మార్కెట్లో విశ్రాంతి తీసుకోవాలన్నా భవనాలు లేవు.. వాహనాల్లోనే సేద తీరాల్సిన దుస్థితి నెలకొన్నది. అలాగే, వాహనాలను పార్కింగ్ చేసేందుకు సరైన స్థలం లేదు. ఈ మార్కెట్‌కు వెళ్లేందుకు.. తిరిగి వచ్చేందుకు ఒకే మార్గం ఉండడంతో వాహనాలకు గంటల సమయం పడుతున్నది. అలాగే, మార్కెట్లో సరైన తాగునీటి సౌకర్యం కూడా లేదని రైతులు వాపోతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి వసతులు కల్పించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.
ఎండకు మాడిపోతున్నాయి..
కొల్లాపూర్ నుంచి మార్కెట్‌కు మామిడి కాయలు తీసుకొచ్చా. వాటిని ఉంచేందుకు సరైన షెడ్లు లేవు. తప్పనిసరి పరిస్థితిల్లో ఎండలోనే ఉండడంతో అవి ఎండిపోయి గిట్టుబాటు ధర రావడంలేదు. మరోవైపు వ్యాపారులు తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారు. ముఖ్యంగా ధరను వ్యాపారులే నిర్ణయిస్తున్నారు. వ్యాపారులంతా కుమ్మక్కై ఒకేధర నిర్ణయించి కొంటుండడంతో రైతులకు న్యాయం జరగటంలేదు. దరల నిర్ణయంపై అధికారులు శ్రద్ధ తీసుకోవాలి.
-రాములు,రైతు