ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో జిల్లాలో విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్థంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ అలసత్వం కారణంగా ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత తొమ్మిది నెలలుగా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి..ఒంటిపై ఉన్న బంగారాన్ని షాపుల్లో కుదువబెట్టి పెట్టి విద్యార్థులకు భోజనాన్ని వండి వడ్డిస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకుపోయిన బిల్లులు రూ.4 కోట్ల వరకు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ బడుల్లో అమ్మ ఆదర్శ కమిటీలతో చేపడుతున్న పనులు ఇంకా సాగుతున్నాయి. ఇటీవల చేపట్టిన టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతులతో చాలాచోట్ల ఉపాధ్యాయుల కొరత నెలకొన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో బోధన జరుగడం లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
మధ్యాహ్న భోజన ఏజెన్సీలు 908..
జిల్లాలో 1,271 పాఠశాలలుండగా..వాటిలో లక్షా యాభైవేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని 908 మహిళా ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. అయితే సకాలంలో బిల్లులు రాక ఏజెన్సీలకు పథకం నిర్వహణ కష్టంగా మారుతున్నది. 9, 10 తరగతుల విద్యార్థులకు సంబంధించిన బిల్లులు గతేడాది డిసెంబర్ నుంచి రూ.1,16,811,360 బకాయిలు పేరుకుపోయాయి.
కోడిగుడ్లకు సంబంధించి మరో రూ.1,36,56,928 పెండింగ్ బిల్లు లు గత డిసెంబర్ నుంచి విడుదల కావాల్సి ఉన్నది. వాటి మొత్తం రూ.4 కోట్ల వరకు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం గతేడాది అట్టహాసంగా ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. కొంతకాలం పాటు ఈ పథకాన్ని ఏజెన్సీలు నిర్వహించగా..అందుకు సంబంధించిన రూ.85,24,512 బకాయిలు అలాగే ఉండిపోయాయి.
అప్పులు చేసి పిల్లలకు వండి పెట్టాల్సి వస్తున్నదని ఏజెన్సీల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు రాక ఏజెన్సీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా..ఏజెన్సీల బాధ్యతలను క్రమక్రమంగా అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడం పట్ల మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఏజెన్సీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.రెండు వేల గౌరవ వేతనం సైతం ఆగిపోయింది.
గతేడాది అక్టోబర్ నుంచే రావడం లేదు. వేతన బకాయిలు సైతం జిల్లావ్యాప్తంగా రూ. 1.60కోట్ల మేర ఉన్నట్లు తెలిసింది. అయితే బడ్జెట్ లేకనే బిల్లులు మంజూరు కావ డం లేదని అధికారవర్గాల నుంచి తెలుస్తున్నది. ఎన్నికల సమయంలో గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. పెంచిన వేతనం మాటేమోగానీ..గతంలో కేసీఆర్ ప్రభుత్వం పెంచిన వేతనాన్ని సైతం ఇవ్వడంలేదని ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సా..గుతున్న సదుపాయాల పనులు..
మన ఊరు-మన బడి, పీఎంశ్రీ పథకాల కింద ఎంపిక కాకుండా మిగిలిపోయిన ప్రభుత్వ పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో మొత్తం 1,309 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ బడుల్లో చేపట్టాల్సిన పనులను గత విద్యాసంవత్సరం చివరలోనే అధికారులు గుర్తించారు. ప్రధానంగా పాఠశాలల్లో ఐదు రకాల సమస్యలు నెలకొన్నట్లు గుర్తించి ఆయా పనులను చేపట్టేందుకు చర్యలు కూడా తీసుకున్నారు.
భవనాలకు మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సమస్యలతోపాటు బాలికలకు మరుగుదొడ్లు లేని చోట కొత్తవి చేపట్టాలని ప్రణాళికను రూపొందించి.. తొలి విడతలో 423 పాఠశాలల్లో పనులను కూడా మొదలు పెట్టారు. అయితే వివిధ కారణాలతో ఆలస్యంగా పనులను ప్రారంభించడంతో నేటికీ సంబంధిత పనులు పూర్తికాలేదు. ఇప్పటివరకు సగానికిపైగా స్కూళ్లలోనే పనులు పూర్తైనట్లు సమాచారం.
మరో 286 పాఠశాలల్లో పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ఇటీవలే అనుమతులు వచ్చినట్లు తెలుస్తుండగా..ఈ పనులు కూడా అంతంతమాత్రంగానే జరుగుతున్నట్లు తెలుస్తున్న ది. పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికే అన్ని పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. నేటికీ కొనసాగుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
బంగారాన్ని కుదువబెట్టి..
తొమ్మిది నెలలుగా గౌరవ వేతనాలు రాక తీవ్ర ఇబ్బందిపడుతున్నాం. అలాగే, గుడ్లు, కూరగాయల బిల్లులు కూడా ఇక రాలేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఒంటిపై ఉన్న బంగారాన్ని షాపుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నాం. బిల్లులు చెల్లిస్తామని.. ఎలాంటి ఇబ్బం దులు ఉండవని.. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల బిల్లులు, వేతనాలను త్వరగా చెల్లించాలి.
– స్వప్న, మధ్యాహ్న భోజన కార్మికురాలు (ఇబ్రహీంపట్నంరూరల్)
మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం తో చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో నెల దాటగానే జీతాలు వచ్చేవి. వచ్చే కొద్ది గౌరవ వేతనంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. అయినా ఆ గౌరవ వేతనం కూడా సమయానికి రాకపోవడంతో అవస్థలు పడుతున్నాం. రేవంత్ ప్రభుత్వం మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
– షబానాబేగం, కౌకుంట్ల జడ్పీహెచ్ఎస్ వంటమనిషి, చేవెళ్ల
పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడిస్తున్నాం. నెలనెలా చెల్లిస్తేనే మధ్యాహ్న భోజన నిర్వహణకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనాన్ని చెల్లించి ఆదుకోవాలి.
– అంజమ్మ, రాయికల్ పాఠశాల, వంట మనిషి, షాద్‌నగర్‌రూరల్