షాద్‌నగర్ టౌన్, మే 12 : ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇలా షాద్‌నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో 1880 ఇండ్లను నిర్మించింది. అందులో షాద్‌నగర్‌లోని గుంట్లకుంట శివారులో 920, సోలీపూర్ గ్రామ సమీపంలో 412, దూసకల్ 368, నందిగామలో 120, తిమ్మాపూర్‌లో 60 ఇండ్ల నిర్మాణం పూర్తైంది.
అయితే.. అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు జరగడం.. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో ఆ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఇండ్లు నిరుపయోగంగా మారాయి. అర్హులకు వాటిని కేటాయింపులో ఆలస్యం జరుగుతుండడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. డబుల్‌బె డ్రూం ఇండ్లతో తమ సొంతింటి కల నెరవేరుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగులుతున్నది.
షాద్‌నగర్ పట్టణంలో సేకరించిన చెత్తాచెదారాన్ని పూర్తిగా షాద్‌నగర్ మున్సిపాలిటీ సోలీపూర్ గ్రామ సమీపంలోని డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. ఈ డంపింగ్ యార్డుకు సమీపంలోనే 412 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే వాటిని అర్హులకు పంపిణీ చేయడంలో ఆలస్యం అవుతుండడంతో రోజూవారీగా పట్టణంలో సేకరిస్తున్న చెత్తాచెదారాన్ని కోట్లాది రూపాయలతో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పక్కనే పోస్తుండడంతో.. ఆ ఇండ్లు పూర్తిగా డంపింగ్‌యార్డులో కలిసి పోయి..కంపుకొట్టడంతోపాటు దుర్గంధం వెదజల్లుతున్నది. ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరకముందే అర్హులకు త్వరగా పంపిణీ చేసి.. డంపింగ్ యార్డును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని లబ్ధిదా రులు, ప్రజలు కోరుతున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. సోలీపూర్ గ్రా మ సమీపంలో 412 ఇండ్లను నిర్మించగా.. వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో ఎన్నికల కోడ్ రాగా.. ఆ ప్రక్రియ ఆగిపోయింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. లబ్ధిదారులకు కేటాయించడంలో రోజురోజుకూ ఆలస్యం జరుగుతుండడంతో ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. అంతేకాకుండా ఆ ఇండ్ల సమీపంలోనే షాద్‌నగర్ పట్టణం నుంచి సేకరించి తీసుకొస్తున్న చెత్తాచెదారాన్ని డంప్ చేస్తుండడంతో ఆ పరిసరాలు కంపు కొడుతున్నాయి.
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీలో ఎందుకు ఆలస్యం జరుగుతున్నది. ఆ ఇం డ్లను కోట్లాది రూపాయలతో నిర్మించా రు. వాటి పక్కనే చెత్తాచెదారాన్ని వేస్తుండడంతో కంపు కొట్టడంతోపాటు తీవ్రంగా దుర్గంధం వెదజల్లుతున్నది. అధికారులు స్పందించి అక్కడి నుంచి డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించి.. ఆ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.
-చీపిరి రమేశ్‌యాదవ్, గ్రామస్తుడు, సోలీపూర్
అర్హులకు డబుల్బెడ్రూం ఇండ్లను వెంటనే కేటాయించాలి. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని నిర్మించింది. ఇండ్ల పంపిణీలో ఆలస్యం అవుతుండడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. షాద్‌నగర్ పట్టణంలో సేకరించిన చెత్తాచెదారాన్ని డబుల్బెడ్రూం ఇండ్ల మధ్య పారబోయకుండా అధికారులు చర్యలు తీసుకుని, లబ్ధిదారులకు కేటాయించాలి.
-శీలం శ్రీకాంత్, టీఆర్ఎస్వీ తాలూకా అధ్యక్షుడు, షాద్‌నగర్