చేవెళ్ల రూరల్, మే 19 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మౌలిక వసతులు సమకూరక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధి సింగపూర్ వార్డులో గత రెండు నెలలుగా మిషన్ భగీరథ నీరు ఏడు బిందెల లోపే వస్తున్నదని.. ఉన్న బోరు పని చేయక 20 రోజులు దాటుతుండడంతో మహిళలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో.. ఆగ్రహం చెందిన మహిళలు సోమవారం వార్డులోని ప్రధాన రోడ్డులో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. బోరు మోటర్‌ను రిపేర్ చేయించి సరఫరాను మెరుగుపరుస్తాం. నీటి ఎద్దడి నివారణకు వార్డుకు ట్యాంకర్లను పంపిస్తున్నాం.
– యోగేశ్, శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్
మిషన్ భగీరథ నీరు సరిపడా రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. బోరు ఉన్నా దాని నుంచి నీరు రావడంలేదు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదు.
– సిరంగారి లక్ష్మి, గృహిణి, సింగపూర్ వార్డు