పరిగి, మే 11 : మొక్కల పెంపకంతో పచ్చదనం పెంపకానికి గత సర్కారు హయాంలో కృషి జరుగగా, నేటి పాలనలో మొక్కల పెంపకంపై అధికారులు పట్టింపులేని ధోరణి అవలంబిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కనీసం నాలుగైదు సంవత్సరాల వరకు మొక్కలకు నీరు పోయడం ద్వారా వాటి ఎదుగుదల బాగుంటుంది. అందులోనూ మండుటెండల సమయంలో నీటిని పోయడం తప్పనిసరి. నీరు పోసేందుకు ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్ ఉన్నప్పటికీ వాటి వినియోగం సరిగ్గా జరగడంలేదు.
ఏడాదికిపైగా పాలకవర్గాలు లేని గ్రామపంచాయతీలలో పంచాయతీ కార్యదర్శుల పనితీరు సరిగ్గా లేక మొక్కలకు నీరు పోసేవారు కరువయ్యారు. ఇందుకు తార్కాణం పరిగి మండలం బర్కత్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారం రెవెన్యూ గ్రామ పల్లె ప్రకృతి వనం. బర్కత్‌పల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రెండు పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేశారు. బర్కత్‌పల్లి, అన్నారం రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూములలో ఈ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. బర్కత్‌పల్లి ప్రకృతివనంలోని రోడ్డువైపు మొక్కలు బాగుండగా.. వెనకాల ఉన్నవి ఎండిపోయాయి.
అన్నారం పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కల ఆలనాపాలన చూసేవారు లేక సగం మొక్కలు ఎండిపోయి, పిచ్చిగడ్డితో నిండిపోయింది. ఉన్న మొక్కల్లో సగమే బతికి బట్టకట్టాయి. అవి సైతం గతంలో పోసిన నీటితో ఎంతోకొంత తట్టుకొని నిలబడి ఎదిగాయి. గత ఏడాదికిపైగా అటువైపు వెళ్లి నీళ్లు పోసినవారే లేరు. ట్యాంకర్ ఉన్నప్పటికీ నీరు పోయించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు.
బర్కత్‌పల్లికి ఆనుకొని ఉన్న స్థలంలో ప్రభుత్వం ద్వారా సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం చేపట్టినా గత ఏడాదికి పైగా నిరుపయోగంగా ఉన్నది. నిర్మాణం చేపట్టిన తొలినాళ్లలో చెత్తను వేరు చేసి సెగ్రిగేషన్ షెడ్డులో వేయడంతో గ్రామస్తులు సంతోషించారు. కొంతకాలం క్రితం సెగ్రిగేషన్ షెడ్డు, వాటర్ ట్యాంకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలు నాటారు.
ఈ క్రమంలో సెగ్రిగేషన్ షెడ్డుకు గల బోర్డును తొలగించి లోపల పడేశారు. చెత్తను వేరు చేయడం అటుంచి.. షెడ్డును వాడుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. కొన్నాళ్లుగా సెగ్రిగేషన్ షెడ్డు నిరుపయోగంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. వాడుకలేని షెడ్డుతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదన్నారు. మరోవైపు గ్రామంలో రోజుకో గల్లీ చొప్పున చెత్త సేకరణ జరుగుతున్నదని గ్రామస్తులు తెలిపారు.
నస్కల్ గ్రామం నుంచి వచ్చే పైప్‌లైన్ వాల్వును ఆ గ్రామానికి అనుగుణంగా తిప్పుకుంటుండడంతో బర్కత్‌పల్లికి సరిపడా నీళ్లు రావడంలేదని ఆ గ్రామవాసులు వాపోయారు. కొద్ది రోజులు మరీ కొంత పరిమాణంలోనే నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో చెరువుకట్ట సమీపంలోని బావి నీటిని సరఫరా చేయడం జరుగుతున్నదని తెలిపారు.
మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో సరఫరా జరిగేలా చూడాలని కోరుతున్నారు. గ్రామంలో ఏదైనా సమస్యకు సంబంధించి విన్నవిస్తే పంచాయతీ కార్యదర్శి సకాలంలో స్పందించడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సమస్యల పరిష్కారంలో సరైన చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా పల్లె ప్రకృతివనంలో మరిన్ని మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని, సెగ్రిగేషన్ షెడ్డు ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.