ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 1 : ఉపాధి హామీ కూలీలకు పనిని కల్పించడంతోపాటు కూలిని సకాలంలో చెల్లించాలని డీఆర్డీవో పీడీ శ్రీలత అన్నారు. ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ 16వ విడత సమావేశాన్ని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులపై ఆరా తీశారు.
సక్రమంగా రికార్డులు నిర్వహించని పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, కొలతలు తీసి ఎంబీలు సరిగ్గా చేయని సాంకేతిక సహాయకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామపంచాయతీల్లోని రికార్డుల ను మూడు నెలలకొక్కసారి అప్డేట్ చేయాలని.. కొత్తగా పనుల్లో చేరిన వారికి వెంటనే జాబ్‌కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో సుభాషిణి, ఏపీడీ సక్రియానాయక్, క్వాలిటీ కంట్రోల్ అధికారిణి పద్మ, ఎంపీడీవో క్రాంతికిరణ్, ఏపీవో తిరుపతిచారి, సామాజిక తనిఖీ స్టేట్ రిసోర్స్ పర్సన్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మంచాల, జూన్ 1 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాంను సకాలంలో అందించాలని రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి శ్రీలత డ్వా క్రా సంఘాల మహిళలకు సూచించారు. శనివారం ఆమె మండల కేంద్రంలోని ఆరుట్ల, మంచాల గ్రామాల్లో విద్యార్థుల యూనిఫాం కుడుతున్న మహిళా సంఘాల కుట్టుమిషన్ కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. విద్యార్థుల యూనిఫాంను కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి లభిస్తుందన్నారు. మండలంలో 3,112 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి సరిపడా యూనిఫాంలను పాఠశాలలు ప్రారంభం లోపే అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శోభ, సీసీ జైపాల్‌రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.