వికారాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తున్నది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైనేజీ నీరు రోడ్లపై పరుగు పెడుతుండడంతో కాలనీలు కంపుకొడుతున్నాయి. జనం రోడ్లపై నడవలేక, దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వర్షపు నీటితో డ్రైనేజీలు నిండి ఇండ్లలోకి మురుగు వస్తున్నది. నిత్యం మురుగునీరు ప్రవహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి పరిష్కార చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
తడి-పొడి చెత్త సేకరణ మినహా ఇతర పారిశుద్ధ్య పనులను గాలికొదిలేయడంతో మురుగు సమస్య మరింత జఠిలంగా మారుతున్నది. ప్రధాన కూడళ్లలోనూ మురుగు నీరు నిలిచి నడవలేని పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా వికారాబాద్ మున్సిపాలిటీలోని రామయ్యగూడ వెళ్లే దారిలో డ్రైనేజీ నీరు రోడ్డుపై పరుచుకొని వెళ్తుండడంతో వాహనాదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు లీకై తాగునీరు కలుషితమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం, పట్టించుకోవాల్సిన పాలకమండళ్లు సైతం వర్గపోరు, గ్రూపు రాజకీయాలకే పరిమితం కావడంతో మురుగు సమస్య ప్రజల పాలిట శాపంగా మారింది.
వర్షపు నీరు నిల్వ ఉండడం, మురుగు రోడ్లపై పారుతుండడంతో దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి తోడు తాగునీరు కూడా కలుషితమవుతుండడంతో మున్సిపాలిటీల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనం చలి జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.