యాచారం, మే 19 : మండలంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. పట్టణ రోడ్లను తలపించేలా గ్రామీణ రోడ్లు, లింకురోడ్ల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల రోడ్లు మీర్ఖాన్పేట నుంచి యాచారం వరకు నాలుగు లేన్ల రోడ్డుకు రూ.48 కోట్లు, నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు 100 ఫీట్ల రోడ్డుకు రూ.29 కోట్ల నిధులను గత కేసీఆర్ సర్కారు మంజూరు చేసింది. ఇందులో భాగంగా అటు కందుకూరు నుంచి ఇటు యాచారం వరకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రధాన రహదారులను కలిపేందుకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు ఫార్మాసిటీకి వెళ్లేందుకు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది.
14కిలోమీటర్ల మేర రెండు రోడ్ల నిర్మాణానికి ఏకంగా రూ.77 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో కందుకూరు నుంచి మీర్ఖాన్ పేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం గత బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయింది. ఔటర్ రింగ్‌రోడ్డును తలపించేలా రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ మీర్ఖాన్ పేట నుంచి యాచారం వరకు నిర్మించే రోడ్డు నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు గత కొన్ని నెలలుగా నిర్మాణ దశలోనే నిలిచిపోయింది. అటు నందివనపర్తి-మేడిపల్లి రోడ్డు నిర్మాణం బ్రిడ్జిల నిర్మాణానికే పరిమితమైంది. ఈ రోడ్లకు మోక్షమెప్పుడో వేచి చూడాల్సిందే మరీ.
నందివనపర్తి నుంచి మేడిపల్లి మీదుగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ వరకు రూ.29 కోట్లతో 100 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా విస్తరించేందుకు సంకల్పించింది. రోడ్డు వెడల్పు పనులను సైతం ప్రారంబించారు. రోడ్డు మార్గంలో ఉన్న రెండు చిన్న కల్వర్టులను పెద్ద బ్రిడ్జిలుగా నిర్మించి వదిలేశారు. ఈ రోడ్డు సైతం బ్రిడ్జిల నిర్మాణానికే పరిమితమైంది. రోడ్డు నిర్మాణం సైతం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో బ్రిడ్జిల వద్ద ప్రయాణికులు వాహనదారులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు.
ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడం, వర్షం కురిస్తే ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి చిన్న కుంటలను తలపించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే నందివనపర్తి, మేడిపల్లి, బొల్లిగుట్టతండా, కొమ్మోనిబావి, గంటోనిబావి గ్రామాలకు చెందిన ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. నందివనపర్తి-మేడిపల్లి లింకు రోడ్డుకు మోక్షమెప్పుడోనని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలని నందివనపర్తి, మేడిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
కందుకూరు మండలం మీర్ఖాన్పేట మైసమ్మ గుడి నుంచి నజ్దిక్ సింగారం, నందివనపర్తి మీదుగా యాచారం వరకు ప్రస్తుతమున్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవతో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేసింది. రూ.48 కోట్ల నిధులతో చేపట్టిన మీర్ఖాన్పేట-యాచారం రోడ్డు పనులు మొదట్లో సాఫీగానే సాగాయి. రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేశారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, రాళ్లు తొలగించారు. రోడ్డు చదును చేసి వెడల్పు చేశారు.
ఇంతలో ప్రభుత్వం మారడంతో ఆ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రోడ్డు వెడల్పులో భాగంగా ఉన్న బీటీ రోడ్డును తొలగించి చదును చేయడంతో మట్టి రోడ్డుగా మారింది. వర్షాలకు రోడ్డుపై మట్టి కొట్టుకుపోయి దుమ్ము లేస్తున్నది. దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రయాణికులు దుమ్మూదూళితో నరకం చవిచూస్తున్నారు. వర్షానికి గుంతలలో నీరు నిలవడంతో వాహనదారులు జంకుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనదారులూ అవస్థలు పడుతున్నారు.
యాచారం నుంచి కందుకూరుకు త్వరగా చేరుకునే ప్రయాణికులు రోడ్డు అద్వాన్నంగా ఉండటంతో గమ్యస్థానానికి సకాలంలో చేరుకోలేక పోతున్నట్లు వాపోతున్నారు. తరచుగా వాహనాలు అదుపుతప్పి కిందపడటంతో గాయాలపాలవుతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. గత ఏడాదిన్నర కాలంగా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ రోడ్డుపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి అర్ధాంతరంగా నిలిచిన పనులను వేగంగా పూర్తి చేసేలా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు నిర్మాణానికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో రోడ్డు నిర్మాణానికి టెండర్ వేసిన కాంట్రాక్టర్ పనుల నుంచి తప్పించుకున్నాడు. సుమారు రూ.20 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. వేరే కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టేందుకు ముం దుకు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. దీంతో ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
యాచారం నుంచి మీర్ఖాన్పేట వరకు చేపట్టిన నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి. గత కొన్ని నెలలుగా రోడ్డు విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, దూళి, అడుగడుగునా గుంతలతో నిత్యం వాహనదారులు నరకం చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ రోడ్డుపై దృష్టి సారించాలి. గత ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది. అదే అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి.
– వర్త్యావత్ రాజూనాయక్, మాజీ సర్పంచ్, నందివనపర్తి
నందివనపర్తి నుంచి మేడిపల్లి మీదుగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీకి 100 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇప్పటికి కేవలం రెండు బ్రడ్జిలు మాత్రమే నిర్మించి వదిలేశారు. రోడ్డుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ నిర్మాణంలోనే పనులు నిలిచిపోవడం గమనార్హం. ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై దృష్టి సారించి మేడిపల్లి-నందివనపర్తి లింకు రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలి. లేదంటే ఆందోళన చేయాల్సి వస్తుంది.
– పొద్దుటూరి రవీందర్‌గుప్తా, స్వచ్ఛంద కార్యకర్త, మేడిపల్లి