తాండూరు, ఫిబ్రవరి 8: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షోకు జననీరాజనం పట్టారు. తాండూరు పట్టణంలోని 36 వార్డుల నుంచి ప్రజలు కేటీఆర్ రోడ్ షోకు హాజరయ్యారు. ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా అని సభలోని ప్రజలను ప్రశ్నించగా లేదు, లేదు అని ప్రజలు బదులిచ్చారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎన్నికల ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి, సీనియర్ నాయకులు విఠల్‌రెడ్డి, చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు, కౌన్సిలర్ అభ్యర్థులు దీపానర్సింహులు, నాయకులు రాజుగౌడ్, శోభారాణి, విజయలక్ష్మి రోడ్‌షోకు జనంతో తరలివెళ్లారు.
పట్టణంలోని పాత తాండూరు నుంచి భారీ సంఖ్యలో ప్రజలు కేటీఆర్ సభకు వెళ్లారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇంటికి చేరుకున్న కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులకు కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగారు. అనంతరం పట్టణంలోని ఇందిరాచౌక్‌లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.