ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 14 : నాటుకోడి పెంపకందారులకు లాభాలు పండిస్తున్నది. సెలవు దినాలు, పండుగవేళల్లో మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తున్నది. ముఖ్యంగా సంక్రాతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. పల్లె, పట్టణం తేడా లేకుండా మాంసం ప్రియులు మటన్‌కు బదులుగా నాటుకోడి మాంసాన్ని ఆరగించేందుకు ఆసక్తి చూపటం కనిపిస్తున్నది. పల్లెలోని నిరుద్యోగ యువకులు నాటుకోళ్ల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. బాయిలర్ కోళ్ల పెంపకంతో పోల్చితే రిస్క్ తక్కువ, మందులు సైతం అంతగా వాడాల్సిన అవసరం లేదు. సహజసిద్ధంగా ఇండ్ల మధ్యన, పెరట్లల్లో పెంచుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలామంది షెడ్లలోనూ నాటుకోళ్లను పెంచుతున్నారు. కరోనా వంటి మహమ్మారిని తట్టుకునేందుకు ఎక్కువమంది ప్రజలు చికెన్ ప్రియులుగా మారారు. ముఖ్యంగా నాటుకోడికూర అంటే ఇష్టపడని వారుండరు. మామూలు రోజుల్లో ఒక్క నాటుకోడి రూ.300, కోడిపుంజు రూ.400ల వరకు పలుకుతుంది. పండుగ సందర్భంగా ఒక్క నాటుకోడి రూ.600, పుంజు 800ల వరకు విక్రయిస్తున్నారు.
భలే క్రేజీ..
ఒకప్పుడు గ్రామీణులు ఇంటింటా కోళ్లను పెంచుకునేవాళ్లు. చుట్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా ఇంటిలో పెంచుకున్న నాటుకోడి కూర వండేవారు. మారిన జీవనశైలితో పాటు వాసన తదితర ఇబ్బందులను గమనించిన ప్రజలు వీటి పెంపకాన్ని తగ్గించారు. ఈ క్రమంలో బాయిలర్ కోళ్లు రావడం, ప్రతి ఊరిలో చికెన్ సెంటర్లు ఉండటంతో ఈ చికెన్‌కే మొగ్గు చూపారు. అంతే కాకుండా బాయిలర్ చికెన్ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరికే అవకాశం ఉండటంతో ప్రజలు నాటుకోడి వైపు అంతగా ఆసక్తి చూపలేదు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు నాటుకోడి వైపు మొగ్గు చూపుతున్నారు.