వికారాబాద్, మే 29 : సదరం క్యాంపునకు స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన దివ్యాంగులపై డాక్టర్లు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. గురు వారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో దివ్యాంగుల కోసం సదరం క్యాం పును డీఆర్డీఏ ద్వారా అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 35 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. మరో 28 మంది రెన్యువల్ చేసుకోగా వారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది.
అయితే, ఉదయం 9:30 గంటలకు రావాల్సిన సంబంధిత డాక్టర్ 11:30 గంటలకు వచ్చారు. 14 మందికి వైద్య పరీక్షలు చేసి మధ్యాహ్నం 1 గంటకు వెళ్లిపోయారు. దాదాపు 63 మందిని పరీక్షించాల్సి ఉండగా కేవలం 14 మందికే పరీక్షలు చేసి వెళ్లడంపై దివ్యాంగులు మండిపడుతున్నారు. ఉదయం 8 గంటలకే దవాఖానకు వచ్చామని.. ఇక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని పలువురు దివ్యాంగులు వాపోయారు. వైద్యులు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డాక్టర్ పట్టించుకోలేదు..
నా తమ్ముడు దివ్యాంగుడు. సదరం క్యాంపునకు వెళ్లేందుకు ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్నాం. పరిగి నుంచి తమ్ముడిని తీసుకొని వికారాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు వెళ్లా. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడే ఉన్నా. తాగేందుకు నీళ్లు కూడా లేవు. మూత్ర శాలలు కనిపించనే లేదు. 9:30 గంటలకు రావాల్సిన డాక్టర్ 11:30 వచ్చారు. దాదాపు 60 మందికి పరీక్షలు చేయాల్సి ఉండగా.. కేవలం 14 మందికే చేసి మధ్యాహ్నం 1 గంటకు వెళ్లిపోయా రు. స్లాట్ బుక్ చేసుకున్న మా పరిస్థితి ఏమిటి.? వైద్య పరీక్షలు నిర్వహించాలని డాక్టర్ను కోరితే పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కలెక్టర్ స్పం దించి ఈ సమస్యను పరిష్కరించాలి.
-మహ్మద్ ఇక్బాల్, పరిగి