న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: గత నెలలో గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పోటెత్తాయి. జనవరిలో ఏకంగా రూ.24,040 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు నెలతో పోల్చితే ఇది రెట్టింపునకు పైగా కావడం గమనార్హం. నిరుడు డిసెంబర్లో రూ.11,647 కోట్లుగానే ఉన్నాయి. అయితే భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ బంగారం ధరలు పెద్ద ఎత్తున పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెజారిటీ మదుపరులు పసిడి వంటి సురక్షిత పెట్టుబడి సాధనాలపట్ల ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లకు గిరాకీ ఒక్కసారిగా పుంజుకున్నది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)లోకి వచ్చిన పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు తొలిసారి మించిపోయాయి. మంగళవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (ఆంఫీ) విడుదల చేసిన వివరాల ప్రకారం.. జనవరిలో ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ రూ.24,028.6 కోట్లుగానే తేలింది. డిసెంబర్‌తో చూస్తే 14 శాతం క్షీణించాయి. నాడు రూ.28,054 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈసారి గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు దాదాపు రూ.12 కోట్లు ఎక్కువని స్పష్టమైంది. కాగా, థీమ్యాటిక్, ఇండెక్స్ ఆధారిత సాధనాల్లోనూ పెట్టుబడులు పెరిగాయి. డిసెంబర్‌తో పోల్చితే జనవరిలో రూ.13,199 కోట్ల నుంచి రూ.15,006 కోట్లకు ఎగిశాయని ఆంఫీ తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో స్థిరంగా కొనసాగుతున్నది. జనవరిలో సిప్‌లలోకి వచ్చిన రూ.31,000 కోట్ల పెట్టుబడులు.. మదుపరుల దీర్ఘకాలిక సంపద సృష్టి వ్యూహాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా, మిడ్‌క్యాప్, స్మాల్క్యాప్లలోకి పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. గత నెల ఇవి వరుసగా రూ.3,185 కోట్లు, రూ.2,942 కోట్లకే పరిమితమయ్యాయి.
డిసెంబర్లో రూ.4,176 కోట్లు, రూ.3,824 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈక్విటీ స్కీమ్‌లలోనే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ గత నెల రూ.7,672 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతేగాక మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,182 కోట్లు, లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,005 కోట్లు వచ్చాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీముల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.594 కోట్లుగా ఉన్నాయి.
మారుతున్న మదుపరుల ఆలోచనా సరళికి ఈ పెట్టుబడులు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు బంగారం అంటే అలంకరణకు అనువైన ఆభరణం మాత్రమే. కానీ ఇప్పుడు చాలామంది దాన్నో పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. మున్ముందు మరింత డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు.
-వరుణ్ గుప్తా, గ్రో మ్యూచువల్ ఫండ్ సీఈవో
ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల విషయంలో మదుపరులు సమన్వయంతో ముందుకెళ్తున్నారనిపిస్తున్నది. పోర్ట్‌ఫోలియోను సుస్థిరం చేసుకోవడంతోపాటు మదుపులో వైవిధ్యాన్నీ చాలామంది ప్రదర్శిస్తున్నారు.
-వెంకట్ ఎన్ చలసాని, ఆంఫీ సీఈవో