ఇబ్రహీంపట్నం, జూన్ 7 : వర్షాకాలం పంటల సాగులో రైతులు తగిన మోతాదులో ఎరువులు వాడాలని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి వినియోగించడం వల్ల పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందని గ్రామగ్రామాన అవగాహన సదస్సుల్లో వివరిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న వ్యవసాయ సదస్సుల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్ద ఎత్తున సూచనలు, సలహాలు చేస్తున్నారు.
అతివృష్టి, అనావృష్టి కారణంగా గత యాసంగి సీజన్లో సరైన దిగుబడులు లేక అన్నదాతలు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పెట్టుబడులు అదుపులో ఉంచుకోవాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సలహా ఇస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే మార్గాలపై దృష్టి సారించాలని అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై మక్కువ పెంచుకోవాలని చెబుతున్నారు.
రసాయన ఎరువులతో భూసారానికి అధిక నష్టం
చీడపీడల నివారణ కోసం రైతులు పెద్ద ఎత్తున రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం ద్వారా భూసారం అధికంగా దెబ్బతినే అవకాశం ఉంది. భూసారం దెబ్బతినటంతో భవిష్యత్తులో పంటల సాగుకు భూములు పనికిరాకుండా పోయే ప్రమాదమున్నందున రైతులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రసాయన ఎరువులు, పురుగుల మందులు తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన ఎరువులు వాడటం ద్వారా పంటలు అధిక దిగుబడులు సాధించే అవకాశముంటుందని సూచిస్తున్నారు.
వ్యవసాయాధికారుల సూచనల పాటించాలి : ఇబ్రహీంపట్నం ఏఈఓ శ్రవణ్‌కుమార్,
రైతులు దిగుబడిపైనే కాకుండా పొలాల్లో భూసారాన్ని కూడా కాపాడుకోవటంపై దృష్టి సారించాలి. అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడటం ద్వారా భూసారం దెబ్బతింటున్నందున రైతులు రసాయన ఎరువులు పూర్తిగా మరిచి సేంద్రియ ఎరువులను వాడుకోవాలి. పంటల సాగు సమయంలో భూసార పరీక్షలు చేసుకుంటే ఎంతో మేలు.