బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 21, 2020 , 00:51:23

అధైర్యపడకండి.. ఆదుకుంటాం

అధైర్యపడకండి.. ఆదుకుంటాం

 ముంపు ప్రాంతాల్లో పర్యటించిన విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి

 జేసీబీలతో పనులు చేయించిన మంత్రి

 సత్యసాయినగర్‌ కాలనీవాసుల సమస్యను పరిష్కరిస్తాం

బడంగ్‌పేట, సెప్టెంబర్‌20: ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని, అధైర్యపడొద్దని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. కాలనీవాసులు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మిథిలానగర్‌, సత్యసాయినగర్‌, ఎంఎల్‌ఆర్‌ కాలనీల్లో మంత్రి పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా నీట మునిగిన కాలనీల ప్రజలను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. జోరువానలోనూ మంత్రి దగ్గరుండి సహాయక చర్యలు చేయించారు. వరద నీరు పోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు  ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు అండగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. వారికి అవసరం అయిన ఏర్పాట్లు చేయించాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.  వరద నీరు పోయేంత వరకు ఇక్కడే ఉంటానని మంత్రి ప్రజలకు భరోసా కల్పించారు. జేసీబీల సహాయంతో వరద నీరు పోవడానికి మంత్రి పనులు చేయించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు సరుకులు, తాగునీటికి ఇబ్బంది కలగొద్దని అధికారులను ఆదేశించారు. ట్రంక్‌లైన్‌ పనులు త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. సమస్యను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకపోయి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప, కమిషనర్‌ సుమన్‌రావు, కార్పొరేటర్లు సిద్దాల బీరప్ప, బొక్క రాజేందర్‌రెడ్డి, దిండు భూపేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు, కాలనీవాసులు ఉన్నారు.