షాద్‌నగర్, డిసెంబర్ 31 : డబ్బులు తీసుకున్నట్లు తేలితే.. ఉద్యోగం నుంచి తొలగిస్తామని రంగారెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన షాద్‌నగర్ సర్కార్ కమ్యూనిటీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వార్తా కథనాలు రావడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు దవాఖానలో విచారించామన్నారు.
ఈ సందర్భంగా ఆయన రోగుల ఓపీ స్లిప్పులను పరిశీలించి, వైద్యాధికారులతో మాట్లాడారు. ఎక్స్‌రే విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగి డబ్బులు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, విచారణలో నిజమని తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు. రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆ నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఇప్పటికైనా వైద్య సిబ్బంది పనితీరులో మార్పు రావాలని.. రోగులతో సేవాభావంతో మెలగాలన్నారు. ఆయన వెంట వైద్యాధికారులు, డాక్టర్ రాజ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.