వికారాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, పదవులను త్యాగం చేసి తెలంగాణవాదం ఉన్నదని చాటిచెప్పిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం దీక్షాదివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, రోహిత్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్సీ క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలోనే 2014కు ముందు పాత రోజులను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. సీఎంగా రేవంత్.. అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయ్యారని, లగచర్ల ఘటనతోనైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. లగచర్ల ఘటనలో ప్రజల్లోనే చైతన్యం వచ్చిందని, గిరిజనుల వెనుక ఎవరూ లేరన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లోని 17 నియోజకవర్గాల్లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం, ప్రజలు ఎవరి వెనుకాల ఉన్నారో తెలుస్తుంది.. అని నవీన్‌కుమార్ రెడ్డి అన్నారు. జనవరి, ఫిబ్రవరిల్లో పార్టీ కమిటీలు ఉంటాయని, ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాకముందు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి బిందెలతో తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, 24 గంటల కరెంట్‌ను సరఫరా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు నాగేందర్ గౌడ్, వీరమణి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
తెలంగాణలో అరాచక పాలన నడుస్తుంది..
– పి.శ్రీశైల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పి.శ్రీశైల్ రెడ్డి అన్నారు. సీఎం సొంత ఊరిలో మాజీ సర్పంచ్ చనిపోతే అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితి ఉన్నదని విమర్శించారు. లగచర్ల గిరిజన మహిళలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, మనమంతా ఒక్కటిగా నిలబడాలన్నారు. 2014కు ముందు తెలంగాణ ఎలా ఉన్నదో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిస్థితి అదేవిధంగా ఉన్నదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై పగ తీర్చుకోవాలని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీదే అధికారమన్నారు.
నరేందర్ రెడ్డిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి..
– డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నామని, రైతుల పక్షాన నిలబడిన నరేందర్ రెడ్డి.. జైలుకెళ్లినా హీరో అయ్యారని, సీఎం రేవంత్ జీరో అయ్యారని విమర్శించారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యేలా నిలదీసి వంద మీటర్ల లోతులో బొంద పెట్టడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామన్నారు.
కేసీఆర్ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..
– మాజీ ఎమ్మెల్యే, కొప్పుల మహేశ్‌రెడ్డి
తెలంగాణ రాష్ట సాధనకుగాను మాజీ సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి 15 ఏండ్లు అయ్యిందని, కేసీఆర్ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్‌తోనే అన్నది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. రైతులకు అండగా నిలిచిన నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఏ సమస్య వచ్చినా నాలుగేండ్లు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలన్నారు.
దామగుండం మోదీకి..లగచర్ల అల్లుడికి..
– మాజీ ఎమ్మెల్యే, పైలట్ రోహిత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని దామగుండాన్ని మోదీకి, లగచర్లను అల్లుడికి అప్పజెప్పారని, మొబిలిటీ వ్యాలీని మరొకరికి అప్పజెప్పడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. లగచర్లలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం బీఆర్ఎస్ విజయమని, లగచర్ల విషయంలో రైతుల పక్షాన నిలబడి యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసిందన్నారు. రైతుల పక్షాన నిలబడిన నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, సొంత తమ్ముడిని అరెస్ట్ చేస్తే మహేందర్ రెడ్డి స్పందన లేదని, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నరేందర్ రెడ్డిపై మహేందర్ రెడ్డి ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్, కేటీఆర్, కొడంగల్ ప్రజల కోసం బీఆర్ఎస్లోనే ఉన్నారన్నారు. కేసులకు భయపడొద్దని, మీ వెంట మేము అండగా ఉంటామని భరోసానిచ్చారు.