జిల్లాలో ఎండల తీవ్రత పూర్తిగా పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తదా అని ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా చేయగా.. ప్రస్తుతం గృహ వినియోగానికి సంబంధించి పట్టణాలతోపాటు గ్రామాల్లో రోజుకు 10-15సార్లు పవర్ కట్స్ జరుగుతున్నాయి. జిల్లాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోపాటు కరెంట్ కోతలతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఉబ్బందులు పడుతున్నారు. మరోవైపు జిల్లాలో నెల రోజుల నుంచి 8 గంటలపాటు అధికారికంగా కరెంట్ కోతలను విధిస్తున్నారు. పొద్దుపోయిన తర్వాత త్రీ ఫేజ్ కరెంట్ సరఫరాను నిలిపివేసి.. అర్ధరాత్రి దాటిన తర్వాతే సరఫరా చేస్తుండటం గమనార్హం. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అధికారికంగా వ్యవసాయానికి కరెంట్ కట్ చేస్తున్నట్లు విద్యుత్తు సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లు వెల్లడిస్తున్నారు.
జిల్లాలోని కొడంగల్, తాండూరు నియోజకవర్గాలు మినహా మిగతా రెండు నియోజకవర్గాల్లో వ్యవసాయానికి దాదాపు 8 గంటలపాటు అధికారికంగా పవర్ కట్ చేస్తున్నారు. ప్రధానంగా బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న వరి పంటకు నీరు పెట్టేందుకు కరెంట్ ఎప్పుడొస్తుందోనని రైతులు పొలాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరెంట్ కోతల ప్రభావంతో ఈ యాసంగి సీజన్లో వరి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని అన్నదాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత నెల ఇదే సమయానికి జిల్లాలో 6.93 మిలియన్ యూనిట్ల మేర డిమాండ్ ఉండగా, ఈ నెలలో 8.68 మిలియన్ యూనిట్లకు విద్యుత్తు డిమాండ్ పెరగడం గమనార్హం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ చీకటి అవుతుందని అక్కసు వెళ్లగక్కిన సమైక్య పాలకుల వ్యాఖ్యలకు దీటుగా వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి పదేళ్లపాటు నిరంతర విద్యుత్తు సరఫరా చేశారు. నాడు కరెంట్ వస్తే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త అనే విధంగా కనీవినీ ఎరుగని మార్పును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారు. రైతులకు కేసీఆర్ తొలుత ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి పగలు 6 గంటలు, రాత్రి సమయంలో 3 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేసి, తదనంతరం రాత్రి పూట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన అన్నదాతలు విద్యుదాఘాతానికి గురై మరణించడం తదితర ఇబ్బందికర ఘటనలతో రైతులకు ఇబ్బంది కలుగకుండా పగటిపూటనే తొమ్మిది గంటలపాటు విద్యుత్తు సరఫరా చేసింది. ఆ తర్వాత 2016 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన ప్రభుత్వం.. 2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేసింది.
జిల్లావ్యాప్తంగా నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకుగాను రూ.303 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయానికి 24 గంటలపాటు విజయవంతంగా విద్యుత్తును సరఫరా చేశారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరాకుగాను 11,617 కిలోమీటర్ల మేర 33కేవీ, 11కేవీ, ఎల్టీ సామర్థ్యంగల విద్యుత్తు లైన్లు వేయడంతోపాటు 13,145 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. దేశానికి వెన్నుముక అయినటువంటి రైతన్న బాగుంటేనే అందరూ బాగుంటారన్న నిజాన్ని విస్మరించిన ఉమ్మడి పాలకులకు బీఆర్ఎస్ సర్కారు అమల్లోకి తీసుకువచ్చిన నిరంతర విద్యుత్తు సరఫరాతో కళ్లు తెరిపించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతతో జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం 3.31 లక్షల ఎకరాల్లో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. నిరంతర విద్యుత్తు సరఫరాతో జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. నిరంతర విద్యుత్తు సరఫరాకు ముందు జిల్లాలో 3.30 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయా పంటల విస్తీర్ణం 2024 వరకు 6 లక్షల ఎకరాలకు పెరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. అధికారికంగా 8 గంటలపాటు పవర్ కట్ చేస్తుండటంతోపాటు ఓ సమయమంటూ లేకుండా మిగతా సమయాల్లోనూ అనధికారికంగా ఓవర్ లోడ్ పేరిట కరెంట్ కట్ చేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా వేళల్లో కోతలు విధిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయం, గృహావసరాలు, పరిశ్రమలకు కలిపి విద్యుత్తు డిమాండ్ 8 మిలియన్ యూనిట్ల వరకు ఉండగా.. 7 మిలియన్ యూనిట్ల వరకు మాత్రమే సరఫరా అవుతున్నది. ఓ వైపు బోర్లు, బావుల్లో అడుగంటిపోతున్న భూగర్భజలాలకు తోడు కరెంట్ కోతలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో సాగు చేస్తున్న పంటలకు ఉన్న నీటినీ అందించలేకపోతున్నారు. మరో వారం, పది రోజులైతే ఎండల తీవ్రత పెరగనున్న దృష్ట్యా కరెంట్ ఎప్పుడొస్తదోనని ఎదురుచూడాల్సిన పరిస్థితులు రానున్నాయి. జిల్లాలో వ్యవసాయంతోపాటు గృహ వినియోగం, పరిశ్రమలకు రోజుకు ప్రస్తుతం 8.68 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా.. 78,506 వ్యవసాయ కనెక్షన్లున్నాయి.