యాచారం, ఆగస్టు2: రైతులకు ఎరువుల కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ ఆధికారిణి ఉషారాణి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఎరువుల గోదామ్‌ను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వను, దానికి సంబంధించిన రిజిష్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వర్షాకాలంలో రైతులకు ఎరువుల కొరత రానివొద్దన్నారు. లిక్విడ్ రూపంలో లభించే నానో డీఏపీ, నానో యూరియా అవసరమైనంత రైతులకు ఎప్పుడూ అందుబాటో ఉండేలా చూడాలన్నారు.
ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని సూచించారు. ఎరువుల విక్రయాలపై వ్యవసాయ అధికారులు దృష్టి సారించాలన్నారు. రైతులకు సరిపడా స్టాక్‌ను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. రైతులకు పంటలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తినా మండల వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు. రైతులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రైతు రిజిష్ట్రీ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు సుజాత, పీఏసీఎస్ చైర్మన్ రవినాథ్, వ్యవసాయ విస్తరణ అధికారులు, పీఏసీఎస్ సిబ్బంది ఉన్నారు.