రంగారెడ్డి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/ వనస్థలిపురం : ఇప్పటివరకు బోగస్ కార్డులతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడాన్ని చూశాం. అలాగే..బినామీ డీలర్లతో బియ్యం పంపిణీలో జరుగుతున్న మోసాల గురించి విన్నాం. కానీ.. పారదర్శకతకు నిదర్శనంగా చెప్పుకొంటున్న ఈ-పాస్ యంత్రాలతోనే నయా దందాను నడిపిస్తుండడం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఒక షాపునకు సంబంధించిన ఈ-పాస్ యంత్రం మరో దుకాణంలో దర్శనమివ్వడంతో ఆరా తీసిన సివిల్ సప్లయ్ అధికారులకు డీలర్ల నయా దందా తెలిసొచ్చింది. జిల్లాలో మొత్తం 5.58 లక్షల రేషన్ కార్డుల కు ప్రతినెలా 11,562.725 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. అయితే ఇందులో 30 శాతం బియ్యం వివిధ రూపాల్లో పక్కదారి పడుతున్నట్లు తెలుస్తున్నది.
వెలుగులోకి సరికొత్త దందా..
వనస్థలిపురంలోని ఓ రేషన్ షాపులో బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయం టూ కొద్దిరోజుల క్రితం సివిల్ సప్లయ్ అధికారులకు అందిన సమాచారం మేరకు అధికారులు అక్కడికెళ్లి తనిఖీలు నిర్వహించారు. అక్కడ మాడ్గుల మండలంలోని ఓ రేషన్ దుకాణానికి సంబంధించిన ఈ-పాస్ యంత్రం ఉండడాన్ని గుర్తించారు. వనస్థలిపురంతోపాటు మాడ్గుల మండలంలోని రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న సరుకులు, పంపిణీ చేసిన బియ్యం లెక్కలను పరిశీలించగా లెక్కల్లో తేడా లేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని అంటున్నారు. అయితే మాడ్గుల మండలంలోని షాపునకు సంబంధించిన యంత్రం వనస్థలిపురంలో ప్రత్యక్షం కావడం మాత్రం మిస్టరీగా మారింది. చార్జింగ్ కోసమే దానిని అక్కడ పెట్టినట్లు మాడ్గుల మండల డీలర్ చెప్పి తాత్కాలికంగా తప్పించుకున్నా.. ఈ ఘటన రేషన్ డీలర్ల నయా దందాను తేటతెల్లం చేసింది.
దందా జరుగుతున్న తీరిది..
పేదలకు బియ్యాన్ని పంపిణీ చేసినందుకు డీలర్లకు క్వింటాలుకు రూ.140 లెక్కన ప్రభుత్వం చెల్లిస్తున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు జిల్లాలో అధికంగా ఉండడంతో పోర్టబిలిటీ విధానం సక్సెస్ఫుల్గా సాగుతున్నది. ఇదే డీలర్లకు వరంలా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ తీసుకునే వారు తక్కువగా ఉండడంతో చాలామంది డీలర్లు పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో అక్కడి ఈ-పాస్ యంత్రాలను ఉంచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి కమీషన్ రూపంలో డబ్బులను అక్రమంగా పొందుతున్నారు. ఇది మొదటి విడుత జరిగే వ్యవహారం. ఇక రెండోది..కార్డుదారులు వేలిముద్రలు వేశాక.. తూకంలో బియ్యం వేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి డీలర్లు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ బియ్యాన్ని దొడ్డిదారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ-పాస్ యంత్రం మాటున జిల్లాలో రూ.కోట్లలో అక్రమ దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఒక షాపులోని బియ్యాన్ని మరో దుకాణానికి సర్దుబాటు చేస్తూ అక్రమాలను కప్పిపుచ్చుతుండగా..సివిల్ సప్లయ్ అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకనే నయా దందా సాగుతున్నదన్న ఆరోపణలున్నాయి.
ప్రతినెలా 30 శాతం బియ్యం పక్కదారి..!
జిల్లాలో అంత్యోదయ, అన్నపూర్ణ ఆహార భద్రతాకార్డులు మొత్తం 5,58,438 వరకు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ప్రతినెలా 11,562.725 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లా లోని 932 రేషన్ షాపులకు కేటాయిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం కిలో బియ్యానికి రూ.39.35పై వరకు ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న బియ్యంలో సుమారు 30 శాతం బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తున్నది. పట్టణాలు, గ్రామాల్లో దళారులను పెట్టుకుని తక్కువ ధరకు కొంటూ కొందరు వ్యాపారులు దందా సాగిస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్ డీలర్లే నేరుగా కార్డుదారుల నుంచి కొంటున్నారు. సేకరించిన బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ చేయించి సన్నరకం బియ్యంలో కలుపుతుండగా..కొందరు మిల్లర్లు సీఎంఆర్ కింద తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన రేషన్ బియ్యం చాలావరకు సరిహద్దులు దాటుతున్నది. ఔటర్ మీదుగా నేరుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈకేవైసీని అమలు చేస్తున్నది. అడపాదడపగా 6ఏ కేసులు నమోదు చేస్తున్నా జిల్లాలో బియ్యం అక్రమ దందాకు మాత్రం తెరపడడం లేదు.
విచారణ చేస్తున్నాం..
వనస్థలిపురం రేషన్ షాపులో మాడ్గుల మండలానికి సంబంధించిన ఈ-పాస్ యంత్రం ఉండడంపై విచారణ జరుపుతున్నాం. రెండు చోట్ల షాపుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేశాం. స్టాక్, బియ్యం పంపిణీలో వ్యత్యాసం లేదని గుర్తించాం. ఈ-పాస్ యంత్రాలతో డీలర్లు చేస్తున్న కొత్త తరహా మోసాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.
-సరోజ, ఏఎస్వో, పౌర సరఫరాల శాఖ,రంగారెడ్డి జిల్లా