వికారాబాద్, నవంబర్ 19 : ‘ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచుతామని ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.. ఎప్పటి నుంచి పెంచుతారో స్పష్టం చేయాలి..’ అని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ర్ట అధ్యక్షుడు కాళ్ల జంగయ్య డిమాండ్ చేశారు.వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రెండో రోజు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి విస్మరించిందని, వాటిని అమలు చేయకపోతే రాష్ర్ట వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. ఈ నెల 26న చలో ఇందిరా పార్కు మహా ధర్నాకు పిలుపునిస్తున్నామని తెలిపారు. పింఛన్లు పెంచాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్‌లకు వినతి పత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో రాష్ర్ట సహాయక కార్యదర్శి విజయ్‌కుమార్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు నల్ల రాజు, జిల్లా అధ్యక్షుడు ఊరడి శ్యాంప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల్ బాల్‌రాజు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బంటూ వెంకటయ్య పాల్గొన్నారు.
ఆదిబట్లలో రిలే నిరాహార దీక్షలు..
ఆదిబట్ల : ఆసరా పింఛన్‌దారులను రేవంత్‌రెడ్డి సర్కారు మోసం చేస్తున్నదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కరంటోత్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసరా పింఛన్‌దారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత గీత, బీడీ కార్మికులకు రూ.4వేలు పింఛన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి రాగానే మర్చిపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్షల మందితో ఈ నెల 26న చలో హైదరాబాద్ చేపడుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో జిల్లా ప్రధాన కార్యదర్శి యాచారం జంగయ్య, గువ్వల యాదయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ సలీం, జిల్లా నాయకులు ఆకుల సంజీవ, భానుప్రసాద్, లింగమయ్య పాల్గొన్నారు.