వికారాబాద్, అక్టోబర్ 21, (నమస్తే తెలంగాణ): దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే విధంగా వికారాబాద్ జిల్లాలో సదరం సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుల పరిస్థితి మారిపోయింది. సదరం సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అధికారుల నిర్వాకంతోనే సదరం సేవలు గత రెండు నెలలుగా నిలిచిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ నిర్వాకంతోనే గత రెండు నెలలుగా ఈ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా దివ్యాంగులకు అంగవైకల్యాన్ని నిర్ధారించే వైద్యుల నిర్లక్ష్యంతోనే సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు వెయ్యి మంది దివ్యాంగులకు గత రెండు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు.
అయితే ప్రతీనెలలో దివ్యాంగులందరికీ కలిపి 6-7 క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది.. కానీ, గత రెండు నెలలుగా ఒక్క క్యాంపును నిర్వహించకపోవడం గమనార్హం. సదరం సర్టిఫికెట్ల జారీలో స్లాట్స్ జారీ చేసేందుకు గత రెండు నెలలుగా పలుమార్లు డీఆర్డీఏ పేరిట లెటర్ పెట్టినా…ఆసుపత్రి సూపరింటెండెంట్ సదరం క్యాంపులు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయకపోవడం గమనార్హం. డీఆర్డీఏ అధికారులు లెటర్ ఇవ్వడంతోపాటు దివ్యాంగులు ప్రజావాణిలో సదరం సర్టిఫికెట్ల కోసం కలెక్టర్‌కు విన్నవించుకుంటున్నారని, తేదీలను ఖరారు చేస్తే సదరం క్యాంపులను నిర్వహిద్దామని చెప్తే వారిపై దబాయింపునకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా నేను ఉన్నతాధికారిని నన్ను మీరు తేదీలు ఖరారు చేయాలని అడుగొద్దంటూ, నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తానంటూ దబాయిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.
సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల ప్రదక్షిణలు చూడలేక ఈనెల 18న మరోసారి కలెక్టర్ పేరిట వికారాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు లెటర్‌ను అందజేసినా…ఇప్పటివరకు స్పందించక పోవడం గమనార్హం. కలెక్టర్ పేరిట అందిన లెటర్‌ను కూడా సదరు సూపరింటెండెంట్ లైట్ తీసుకుంటుండడంతో సూపరింటెండెంట్ వ్యవహారాన్ని నేడో, రేపో కలెక్టర్ వద్దకు తీసుకుపోవాలని డీఆర్డీఏ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు సదరం సర్టిఫికెట్లను జారీ చేసేలా చూడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు దివ్యాంగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వికారాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపునకు కేటాయించిన గదిని ఖాళీ చేయాలంటూ ఆసుపత్రి సిబ్బందితోపాటు డీఎంహెచ్‌వోతో ఫోన్ చేయిస్తూ డీఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా సదరం క్యాంపునకు కేటాయించిన గదిని ఖాళీ చేస్తారా..తాళం విరగ్గొట్టాలా అంటూ దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లను జారీ చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు సదరం క్యాంపునకు కేటాయించిన గదిని కూడా ఖాళీ చేయా లంటూ దబాయించడంతో సూపరింటెండెంట్‌పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే గత నెలలో కూడా డీఆర్డీఏ అధికారుల ఒత్తిడితో ఒక తేదీని నిర్ణయించినప్పటికీ దివ్యాంగులందరికీ ఒకే తేదీని కేటాయించగా, సంబంధిత స్పెషలైజేషన్ వైద్యులకు సమాచారం ఇవ్వకపోవడంతో సదరం క్యాంపునకు వచ్చిన దివ్యాంగులు అందరూ సాయంత్రం వరకు ఎదురుచూసి వెళ్లిపోయారు. ఇప్పటికైనా సదరు అధికారి తీరు మార్చుకోవాలని సమస్యను తీర్చాలని దివ్యాంగులు కోరుతున్నారు.