కొడంగల్, మే 6 : కష్టపడి పండించుకున్న పంటను కూడా అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. పంట పండించడం ఒక ఎత్తైతే.. అమ్మడం అన్నదాతకు సవాలుగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామగ్రామాన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వంతో రైతులకు కష్టాలు తప్పడంలేదు. గ్రామాల్లో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకాలు లేవని, కేవలం తేమ శాతాన్ని పరిశీలించి, రైతు వివరాలను సేకరించి నేరుగా మిల్కు ధాన్యాన్ని పంపిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.
తద్వారా మిల్లర్లు తూకాల్లో అధిక తరుగును తీస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ధాన్యం ఖాళీ బస్తాల కోసం వ్యవసాయ కార్యాలయం ఎదుట పడిగాపులు కాసి టోకెన్ తీసుకోవాలని, ఆ తరువాత సొంత వాహనాల్లో ధాన్యాన్ని మిల్కు తరలించాల్సిన పరిస్థితి నెలకొంటున్నట్లు పేర్కొన్నారు. తూకంలో నష్టపోవడంతోపాటు రవాణాపరంగా కూడా నష్టాన్ని భరించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల మండలాలకు సంబంధించి కొడంగల్‌లోని ఒక రైస్‌మిల్‌ను కేటాయించారని, ఎర్రటి ఎండలో క్యూలో నిలబడి పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి రైతన్నకు ఏర్పడినట్లు వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని తూకం వేసి సేకరిస్తే ఈ స్థాయి ఇబ్బందులు ఉండేవి కావని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.