రెవెన్యూ వ్యవస్థలోనే ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది ధరణి పోర్టల్. ధరణి రాకముందు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యుటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరికి పహాణి కావాలన్నా.. పడిగాపులు కాయాల్సి వచ్చేది. కొంతమంది భూములైతే ఏకంగా రికార్డుల నుంచే మాయమయ్యేవి. డబుల్ రిజిస్ట్రేషన్లూ జరిగిన దాఖలాలు లేకపోలేదు. ఇటువంటి సమస్యలన్నింటికీ నేడు ‘ధరణి’ సమాధానమై నిలిచింది. తక్షణమే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవడంతోపాటు కొద్ది రోజుల్లోనే చేతికి పట్టా అందుతున్నది. భూ రికార్డులన్నీ పోర్టల్‌లో భద్రంగా ఉన్నాయి. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడింది. అంతేకాకుండా ప్రభుత్వ, అసైన్డ్, ఇతర నిషేధిత జోన్లలో ఉన్న భూముల క్రయవిక్రయాలకు చెక్ పడింది. కోర్టు కేసులున్న సర్వే నంబర్లను బ్లాక్ చేసే విధానం అందుబాటులో ఉన్నది. ఇక పోర్టల్‌లోనే పహాణి, 1బీ పత్రాలు లభ్యమవుతుండడంతో అన్నదాతలకు పడిగాపులు కాసే తిప్పలు తప్పింది. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవడం.. వెంటనే డాక్యుమెంట్ చేతికందుతుండడంతో రైతులకు డబ్బు, సమయం ఆదా అవుతున్నది. ధరణి పోర్టల్‌తో గోస తీరిందని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-వికారాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ
వికారాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు పారదర్శక సేవలందుతున్నాయి. ప్రధానంగా ధరణి అందుబాటులోకి రావడంతో డబుల్ రిజిస్ట్రేషన్లకు పూర్తిగా చెక్ పడింది. గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగేవి. వ్యవసాయ భూములకు సంబంధించి రికార్డులు మాత్రం మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉండేవి. దీంతో ఎవరు స్లాట్ బుక్ చేసుకున్నా ఎలాంటి పరిశీలన, తనిఖీలు లేకుండానే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసేవారు. ఎలాంటి రికార్డు పరిశీలన లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడంతో ధరణికి ముందు చాలా వరకు ఒకే భూమిని ఇద్దరు, ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ధరణి అందుబాటులోకి వచ్చిన అనంతరం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించడంతో రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే సంబంధిత సర్వే నెంబర్ భూ రికార్డులను పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో డబుల్ రిజిస్ట్రేషన్లకు పూర్తిగా అడ్డుకట్ట పడింది. నిషేధిత భూములైన ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ తదితర భూములనూ రిజిస్ట్రేషన్లు చేస్తుండేవారు.
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన అనంతరం నిషేధిత జాబితాలో చేర్చి ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరుగకుండా ధరణి పోర్టల్ నిషేధిత భూముల జాబితాను గ్రామాల వారీగా పొందుపర్చారు. గతంలో కోర్టు కేసులున్నా రిజిస్ట్రేషన్లు జరిగిన పరిస్థితులుండేవి. కానీ ప్రస్తుతం కోర్టు కేసులున్నట్లయితే ధరణి పోర్టల్‌లో కోర్టు ఇంటిమేషన్ ఆప్షన్లో కోర్టు ఆర్డర్‌ను పొందుపర్చి దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత సర్వే నెంబర్ జిల్లా కలెక్టర్ క్రయవిక్రయాలు జరుగకుండా బ్లాక్ చేస్తున్నారు. గతంలో పహాణీ, 1బీ ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లోనే పహాణీ, 1బీ లను పొందుపర్చడంతో ఏ సర్వే నెంబర్ పహాణీ అయినా సులువుగా తీసుకునే వెసులుబాటుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత కూడా రాతపూర్వక డాక్యుమెంట్ కావడంతో వివరాలు తప్పుగా రాసి గందరగోళం సృష్టించేవారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లోనే డాక్యుమెంట్ తయారై వస్తుండడంతో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసే ఆస్కారం లేకుండా పారదర్శకత అందుబాటులోకి వచ్చింది. గతంలో కొందరు అవినీతి అధికారులు భూ రికార్డులను కూడా తారుమారు చేసిన పరిస్థితులున్నాయి. ధరణి అందుబాటులోకి వచ్చిన అనంతరం ఒక్కసారి వివరాలను పొందుపర్చినట్లయితే మార్పులు, చేర్పులు చేసేందుకు ఎవరికీ ఆస్కారం లేకుండా రైతుల సంక్షేమం కోసం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ధరణితో దళారుల బాధ తప్పింది : సత్యనారాయణ, రైతు; జనగాం, పెద్దేముల్ మండలం
భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణితో దళారులను ఆశ్రయించి మోసపోయే బాధ తప్పింది. గతంలో పాస్‌బుక్కుల్లో ఏదైనా తప్పులు దొర్లితే సరిచేసుకునేందుకు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. వారు అడిగినన్ని డబ్బులు ఇచ్చి కొన్ని నెలల పాటు ఆగి పనులు చేయించుకొనేవాళ్లం.రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగి తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా భూ సమస్యలు పరిష్కరించుకోగలుగుతున్నాం.
నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్..
గతంలో భూముల క్రయ-విక్రయాలకు సంబంధించి రైతులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకంతో డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్తే, సంబంధిత డాక్యుమెంట్ రైటర్ స్టాంప్ డ్యూటీ చూసి, చలానా చెల్లించి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సబ్ రిజిస్ట్రార్‌కు అందజేసేవారు. రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సరిచూసిన అనంతరం ఫొటో, సంతకాల నిమిత్తం సెక్షన్‌కు పంపించేవారు. తదనంతరం పార్టీల సంతకాలను సేకరించేవారు. ఈ విధంగా కేవలం డాక్యుమెంటేషన్కే సగం రోజు పట్టేది. రిజిస్ట్రేషన్ పూర్తైన అనంతరం డాక్యుమెంట్ కనిష్ఠంగా 3-4 రోజులు, గరిష్ఠంగా 15 రోజుల వరకు అందజేసేవారు. సంబంధిత డాక్యుమెంట్‌తో మీసేవలో ఆమెండ్మెంట్కు దరఖాస్తు చేసుకున్నట్లయితే 30 రోజుల్లో నోటీసులిచ్చి 45 రోజుల్లో పేరు మార్పులు చేసే ప్రక్రియను పూర్తి చేసేవారు.
ధరణితో ప్రస్తుతం అమ్మినపట్టాదారు పాసుపుస్తకంతోపాటు వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, కొన్నవారి, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులు, అమ్మిన, కొన్న వారి పాన్ కార్డులు(పాన్ కార్డు లేనట్లయితే ఫారం-60/61 ధ్రువీకరణ పత్రం) తోపాటు రూ.200లను చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లయితే సంబంధిత పార్టీలకు రిజిస్ట్రేషన్ సమయం మెస్సేజ్ వస్తుంది. స్లాట్ బుకింగ్ అనంతరం నేరుగా ధరణి కంప్యూటర్ ఆపరేటర్ లాగిన్లోకి వెళ్తుంది. మరుసటి రోజు రిజిస్ట్రేషన్‌కు వెళ్లిన వెంటనే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సరిచూసుకొని రెండు పార్టీల ఫొటోలు సంతకాలతోపాటు సాక్షుల సంతకాలను సేకరించి పేరు మార్పులు చేసి మండల సబ్ రిజిస్ట్రార్ లాగిన్‌కు పంపిస్తారు. మండల సబ్ రిజిస్ట్రార్ సరిచూసి అన్ని డాక్యుమెంట్ సరి ఉన్నట్లయితే ఆయన తన లాగిన్‌లో సంతకం చేసి, తదనంతరం ధరణి పోర్టల్‌లో పొందుపర్చి, కొనుగోలు చేసిన పార్టీకి ప్రింటెడ్ డాక్యుమెంట్ కాపీని కేవలం 10 నిమిషాల వ్యవధిలో అందజేస్తున్నారు.
సక్సెషన్స్(వారసత్వ రిజిస్ట్రేషన్)..
గతంలో ఏదేని పట్టాదారు మరణిస్తే సదరు కుటుంబ సభ్యులు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీతోపాటు మరణ ధ్రువీకరణ పత్రంతో మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేవారు. తహసీల్దార్ సంబంధిత దరఖాస్తును పంచనామా నిమిత్తం వీఆర్వోకు పంపితే, వీఆర్వో పంపిన రిపోర్ట్ మేరకు అమెండ్మెంట్ చేసి ప్రొసీడింగ్స్ జారీ అయ్యేది. తదనంతరం నోటీసు జారీ చేసి మార్పులు, చేర్పులు చేసేందుకు 45 రోజుల గడువు పట్టేది. చాలా వరకు సక్సెషన్ విషయంలో ఏండ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఉండేది. లంచం ఇస్తేనే సక్సెషన్ పూర్తి చేసేవారు. ప్రస్తుతం వారసత్వ రిజిస్ట్రేషన్‌కై పట్టాదారు పాసు పుస్తకం, పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులతో మీ సేవలో రూ.200లను చెల్లించి స్లాట్ బుక్ చేసిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్‌కు పూర్తి కావడంతోపాటు కుటుంబ సభ్యుల పేరిట కొత్త పట్టాదారు పాసు పుస్తకం జారీ అవుతున్నది.
పార్టీషన్ రిజిస్ట్రేషన్(భాగ పంపిణీ)..
గతంలో పార్టీషన్స్కు సంబంధించి ఎక్కువ మంది సివిల్ కోర్టులను ఆశ్రయించేవారు. ఏండ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగినప్పటికీ వారసులకు సంబంధించి పార్టీషన్స్ మాత్రం పూర్తయ్యేది కాదు. కానీ ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా భాగ పంపిణీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్లాట్ బుక్ చేసిన 24 గంటల్లోగా పూర్తవుతుంది. వారసుల ఒప్పంద అఫిడవిట్‌ను అప్లోడ్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ సమయానికి వారసుల అఫిడవిట్‌కు సమ్మతమే అయినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్రింటెడ్ డాక్యుమెంట్‌ను అందజేస్తున్నారు.
ఐదు నిమిషాల్లో రిజిస్ట్రేషన్..
కాగితాలు అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఐదు నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. కొనే వారు, అమ్మే వారు, సాక్షులు ఉంటే చాలు. గతంలో మధ్యవర్తి అవసరం ఉండేది. ధరణి పోర్టల్‌తో రైతులకు మేలు జరుగుతున్నది.
– దేవేంద్రప్ప, కొర్విచేడ్ (బషీరాబాద్)
వారం రోజుల్లో మ్యుటేషన్..
మీ సేవలో దరాఖాస్తు చేసుకున్న రశీదును తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చిన వారం రోజుల్లో భూమి మ్యుటేషన్ అయ్యిందని సమాచారం వచ్చింది. పైసా ఖర్చు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా పనులు అవుతున్నాయి.
– ఇసుబ్జానీ, బషీరాబాద్
ధరణి భేష్..
‘ధరణి’తో ఈజీగా మ్యుటేషన్, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. గతంలో అధికారులు ఏమీ చెబితే అదే రైట్. ధరణి పుణ్యాన రైతులకు మేలు జరుగుతున్నది. ధరణి పోర్టల్‌లో నేడు ఆన్లైన్ చేసుకున్న మరుసటి రోజే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి.
– శంషొద్దీన్, మల్కాపూర్, తాండూరు
రైతుకు ఓ వరం
ధరణి పోర్టల్ రైతులకు వరం. భూమి ఎంత ఉంది.. ఎక్కడా ఉందో ఆన్లైన్లో ఇట్టే తెలిసిపోతుంది. రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నది. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగే వారు. మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు సులువుగా జరుగుతున్నాయి.
– నర్సింహులు, గౌతాపూర్, తాండూరు
వెంటనే మ్యుటేషన్
ధరణి పోర్టల్‌తో క్షణాల్లో మ్యుటేషన్ పూర్తవుతున్నది. గతంలో అధికారుల చుట్టూ తిరుగుతూ.. అడిగినంత లంచం ఇచ్చేది. దళారుల ప్రమేయం లేకుండా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది.
– బెన్నూర్ నారాయణ, అంగడిరైచూర్, కొడంగల్
తిరిగే తిప్పలు తప్పాయి..
ధరణి పోర్టల్‌తో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. గతంలో మ్యుటేషన్ కోసం సంవత్సరాల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– సునీల్, పట్లూర్ తండా, మర్పల్లి మండలం
దళారులు లేని రిజిస్ట్రేషన్లు..
దళారులకు తావు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. గతంలో మ్యుటేషన్, సక్సెషన్లకు ఏండ్ల కొద్ది కార్యాలయాల చుట్టూ తిరిగేది. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను అర్థం చేసుకుని ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు.
– రమేశ్ మిత్ర, మర్పల్లి మండలం
వృథా ఖర్చులు తగ్గాయి..
ధరణి పోర్టల్‌తో వృథా ఖర్చులు తగ్గాయి. గతంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సాక్షులతో పాటు మరి కొందరిని తీసుకెళ్లేది. ధరణి వచ్చాక మండల కేంద్రంలోనే పనులు జరుగుతున్నాయి. పేద రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది.
– మల్గు చంద్రయ్య, అంగడి చిట్టంపల్లి, పూడూరు మండలం
పని భారం తగ్గింది..
ధరణి పోర్టల్‌తో భూముల రిజిస్ట్రేషన్లు సులభతరమయ్యాయి. దీంతో పని భారం తగ్గింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దళారులకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ధరణి పోర్టల్ అమల్లోకి తేవడం సంతోషంగా ఉన్నది.
– రామయ్య, గ్రామం, మండలం కోట్‌పల్లి
రిజిస్ట్రేషన్ సులభంగా..
ధరణి పోర్టల్‌తో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభంగా మారింది. మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఇచ్చిన సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే వెంటనే పని పూర్తవుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– మల్కోల సుజాత, గ్రామం అంగడిచిట్టంపల్లి, మండలం పరిగిa
పట్టా మార్పిడి శరవేగంగా..
ఒకప్పుడు పట్టామార్పిడి చేయాలంటే 3, 4 నెలల సమయం అవుతుండే. ధరణి వచ్చాక శరవేగంగా పని పూర్తవుతున్నది. దళారులను సంప్రదించాల్సిన పని లేకుండా పోయింది. సీఎం కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారు.
– జనార్దన్, మారేపల్లి గ్రామం, పెద్దేముల్ మండలం
భూ రికార్డుల్లో ధరణి మేటి..
భూరికార్డుల ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. మ్యుటేషన్, పాస్‌బుక్, అమ్మకం, వారసత్వ నమోదు, తనఖా, జీపీఏ తదితర ఎన్నో సేవలు సులువుగా లభిస్తుడడం సంతోషకరం.
– తమ్మల రామచందర్, గ్రామం కోకట్, యాలాల మండలం