మంచాల : ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో బుధవారం పెద్దమ్మతల్లి, గంగమ్మతల్లి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్ఛరణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవార్ల విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా హోమ కార్యక్రమంతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠను వేదపండితుల ఆధ్వర్యంలో చేపట్టారు.
విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోతు నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపీటీసీ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు చీరాల రమేశ్, బహదూర్, నాయకులు జగన్రెడ్డి, రావుల శంకర్, గడ్డం రాజేశ్, సత్యనారాయణతో పాటు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.