ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు షురూ అయ్యాయి. ఆదివారం మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపురాసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
షాద్‌నగర్‌టౌన్, అక్టోబర్ 15: దేవీ నవరాత్రోత్సవాలు షాద్‌నగర్ పట్టణంలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్య ప్ప మందిరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలత్రిపురాసుందరీదేవిగా దర్శనమిచ్చారు. వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు బాలత్రిపురాసుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. మున్సిపాలిటీలోని పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారు స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గల రామాలయ, శివాలయంలో కొలువైన అన్నపూర్ణేశ్వరీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మ వారు అన్నపూర్ణ్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో దేవీశరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మ వారు బాలత్రిపురా సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శిరోలీపంతూనాయక్, నిర్వాహకులు రామావత్ భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. యాచారం : మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు గ్రామాల్లో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మండపాలను విద్యుత్ దీపాలు తదితర వాటితో అందంగా తీర్చిదిద్దారు.