తుర్కయాంజాల్, మార్చి 28 : రూ.450 కోట్లతో కొహెడ ఫ్రూట్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం 48వ సర్వసభ్య సమావేశం సంఘం చైర్మన్ సత్తయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సంఘం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువ కలిగిన 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సహకార సంఘం వారు నాబార్డు నిధులతో గోదాములు నిర్మించడం అభినందనీయమన్నారు. ప్రతి సహకార సంఘం తమ సంఘానికి ఆస్తులను సంపాదించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. కొహెడ ప్రాంతంలో గోదాములతో పాటుగా సుమారు 170 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్రూట్ మార్కెట్ కూడా త్వరలో సిద్ధం కానుందని తెలిపారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైందన్నారు. రాబోయే 10 నెలలలో పనులు పూర్తవుతాయన్నారు. మార్కెట్ ద్వారా సుమారు 7 వేల నుంచి 8 వేల మంది వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో ఫాక్స్‌కాన్ కంపెనీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, సీఈవో శ్రీనివాస్ రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు సామ సంజీవరెడ్డి, చెక్క లక్ష్మమ్మ, నర్సింగ్, యాదగిరి, స్వప్న, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.