తెలంగాణలో కొలువుల కుంభమేళా కొనసాగనున్నది. తాజాగా ఖాళీల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, రంగారెడ్డి జిల్లాలో ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అధికారులు వెల్లడించారు. త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తుండడంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జిల్లా కేడర్ పోస్టుల్లో 1561 ఖాళీలు ఉండగా, విద్యాశాఖలో 705, రెవెన్యూ శాఖలో 70 పోస్టులతో పాటు మిగిలిన ఉద్యోగాలనూ భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు ఉన్నవారు అర్హులు కాగా, ఓసీలకు 44 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల వరకు వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన నిరుద్యోగుల్లో ఉత్సాహం నెలకొన్నది.
– రంగారెడ్డి, మార్చి 11, (నమస్తే తెలంగాణ)
ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతో ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఆయా శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా జిల్లాస్థాయి పోస్టుల ఖాళీలను సీఎం కేసీఆర్ ప్రకటించగా, ఆయా శాఖల అధికారులు టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఖాళీల భర్తీకి అవసరమైన కసరత్తు, పదోన్నతుల ప్రక్రియ పూర్తితోపాటు ప్రత్యక్ష నియామక పద్ధ్దతిలో చేపట్టాల్సిన ఖాళీల భర్తీని జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. రెవెన్యూ శాఖతోపాటు ఇతర శాఖలన్నింటిలోనూ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పద్ధతిలో నియామక ప్రక్రియను పూర్తి చేశారు. కాగా ప్రస్తుతం మిగతా పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలతోపాటు అన్ని శాఖల్లోని జిల్లాస్థాయి, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. జిల్లా క్యాడర్ పోస్టులైన టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, చైన్మెన్లు, కుక్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్లు, స్వీపర్, వాచ్‌మన్, గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా జోనల్ పోస్టులైన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఎస్ఐ తదితర పోస్టులకు సంబంధించి చార్మినార్ జోన్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతోపాటు జిల్లా నిరుద్యోగు లు పోటీ పడనున్నారు. అయితే టీచర్ పోస్టులను టెట్ పరీక్ష నిర్వహించి భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నోటిఫికేషన్ జారీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. అదేవిధంగా కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేసిన దృష్ట్యా ఖాళీలకు సంబంధించి పూర్తి స్పష్టత రావడంతో పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలో 80,039 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటిలో జిల్లాకు సంబంధించి జిల్లా క్యాడర్ పోస్టులు 1561 భర్తీ చేయనున్నారు. అయితే జిల్లాలోని విద్యాశాఖలో 705 పోస్టులు ఖాళీగా ఉండగా, జిల్లా రెవెన్యూ శాఖలో 70 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. విద్యాశాఖలో పదోన్నతుల ద్వారా 311 పోస్టుల ఖాళీలు ఏర్పడగా, ప్రత్యక్షంగా నియమకానికి సంబంధించి 394 పోస్టులు ఖాళీలున్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు తేల్చారు. విద్యాశాఖలోని స్థానిక సంస్థల బడుల్లో పోస్టుల ఖాళీల్లో అత్యధికంగా ఎస్జీటీ తెలు గు సబ్జెక్టుకు సంబంధించి 181 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు-67, పీఎస్‌హెచ్‌ఎం-65 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ మ్యా థ్స్(తెలుగు మీడియం)-17, స్కూల్ అసిసెంట్ మ్యాథ్స్(ఉర్దూ మీడియం)-3, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్(తెలుగు మీడియం)-5, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్(ఉర్దూ మీడియం)-2, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్(తెలుగు మీడియం)-54, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్(ఉర్దూ మీడియం)-4, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం(తెలుగు మీడియం)-96 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం(ఉర్దూ మీడియం)-6 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు-26, స్కూల్ అసిస్టెంట్ హిందీ-10, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్-17, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ-1, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్(తెలుగు మీడియం)-3 పోస్టులు, తెలుగు లాంగ్వేజ్ పండిట్-14, హిందీ లాంగ్వేజ్ పండిట్-8, పీఈటీ తెలుగు మీడియం-4, ఎస్జీటీ తెలుగు-181, ఎస్జీటీ ఉర్దూ-20, ఎస్జీటీ ఇంగ్లిష్-33, ఆర్ట్-డ్రాయింగ్ టీచర్(తెలుగు మీడియం) -10, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ (తెలుగు)-1, క్రాఫ్ట్ టీచర్(తెలుగు)-20, ఎంటీఐ-పీవీఐ-ఎస్ఐ(తెలుగు)-1 పోస్టు ఖాళీలున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ బడుల్లో ఖాళీలకు సంబంధించి గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు-2, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్(తెలుగు మీడియం)-1, స్కూల్ అసిస్టెంట్ హిందీ-2, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్-4, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్(తెలుగు)-2, ఎస్జీటీ తెలుగు-5, ఎస్జీటీ ఉర్దూ-9, ఆర్ట్-డ్రాయింగ్ టీచర్(తెలుగు)-2, మ్యూజిక్ టీచర్(తెలుగు)-1 పోస్టు ఖాళీలున్నాయి. నాన్-టీచింగ్‌లో భాగంగా 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.
జిల్లా క్యాడర్ పోస్టులకు సంబంధించి రెవెన్యూ శాఖలో 70 ఖాళీలున్నాయి. వీటిలో సీనియర్ అసిస్టెంట్లు-4, జూనియర్ అసిస్టెంట్లు-11, జూనియర్ స్టెనో-1, రికార్డ్ అసిస్టెంట్లు-3, ఆఫీస్ సబార్డినేట్లు-49, ధపేదార్-1, ఇతరులు-1 పోస్టుల ఖాళీలున్నాయి.