వికారాబాద్, జూలై 2 : పాఠశాల విద్యార్థులకు అందాల్సిన నిధులు ప్రధానోపాధ్యాయుడు కాజేశారని పాఠశాల కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం వికారాబాద్ మండలం మైలార్ దేవరంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రాకుండా గ్రామస్తులు హెచ్ఎంను అడ్డుకున్నారు. అనంతరం డీఈఓ రేణుకాదేవి పాఠశాలకు వెళ్లడంతో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్ఎం పనితీరును వివరించారు.
హెచ్ఎం పాఠశాల నిధులను దుర్వినియోగం చేశారని వివరాలు డీఈవోకు తెలిపారు. అదే విధంగా పాఠశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి ‘ఈ హెచ్ఎం మాకు వద్దు’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో పాటు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల హెచ్ఎం గోవిందుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల కోసం అందించిన నిధులు.. విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు రూ.15వేలు, పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ రూ.9,690, ఆట వస్తువులకు రూ.25వేలు, బడిబాటకు రూ.1000, పాఠశాల నిర్వహణకు రూ.50వేలు, తదితర పనులకు కలిసి మొత్తం రూ.1,07,190 నిధులు మంజూరయ్యాయని వారు తెలిపారు. ఈ నిధులను ఎక్కడ ఖర్చు చేయకుండా పాఠశాల హెచ్ఎం గోవిందు స్వాహా చేశారని డీఈవోకు వివరించారు. డీఈవో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులతో పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
మైలార్దేవరంపల్లి హెచ్ఎం గోవిందు పాఠశాల నిధులు దుర్వినియోగం చేసినట్లు తమ దృష్టికి వచ్చింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ విషయంలో ఎంఈవో కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలు అందగానే పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎంపై చర్యలు తీసుకుంటాం.
– డీఈవో రేణుకాదేవి, వికారాబాద్