Footpath | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి20 : కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని 131 కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ నుండి పద్మ నగర్ రింగ్ రోడ్ మీదిగా సుచిత్ర వైపునకు వెళ్లే ప్రధాన దారికి ఇరువైపులా ఉన్న పుట్ పాత్ ఆక్రమణలు గురువారం టౌన్ ప్లానింగ్ అధికారులు సురేందర్ రెడ్డి, రమేష్ నేతృత్వంలో కూల్చివేతలు చేపట్టారు.
గత కొన్ని రోజులుగా కాలనీలకు అంతర్గతంగా వెళ్లే రహదారులను పూర్తిగా ఆయా దుకాణ సముదాయాలు, వ్యాపారస్తులు రోడ్డుపై ఫుట్ పాత్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం సమయంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీనికి తోడు స్కూల్ బస్సులు ఇతర పెద్ద వాహనాలు ఈ దారుల గుండా రావాలంటే గగనంగా మారింది.
అయితే స్థానికంగా కాలనీల వాసులు, వాహనదారులు చేస్తున్న ఫిర్యాదుల మేరకు కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలు, ఇతర యంత్రాలతో ఫుట్ పాత్ ఆక్రమణలు పూర్తిగా తొలగించారు. ప్రధానంగా చింతల్ బస్ స్టాప్ నుండి ఎల్లమ్మ గుడి టెంపుల్ వరకు ఈ ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించగా మిగిలిన ప్రాంతంలో త్వరలో తొలగించేందుకు తగు చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు.