 
                                                            యాచారం, అక్టోబర్ 30 : అరకొర బస్సులతో గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వారు సరిపడా బస్సుల్లేకపోవడంతో ఫుట్బోర్డులో వేలాడుతూ ప్రమాదకరం గా ప్రయాణిస్తున్నారు. ఏమైన పట్టుతప్పితే అంతే.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు నిత్యం కిక్కిరిసిపోతున్నాయి. దీంతో విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో సరిపడా బస్సులను నడపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహిళలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బస్సులు కిటకిట 
ఉదయం గ్రామాల నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సులు విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు, రైతులతో కిక్కిరిసిపోతున్నాయి. కొందరు విద్యార్థులు తప్పని పరిస్థితుల్లో ముందు, వెనుక డోర్లలో వేళాడుతూ ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం సమయంలోనూ బస్సుల్లో అదే పరిస్థితి కనిపిస్తున్నది. మండలంలోని తాటిపర్తి, మేడిపల్లి, కుర్మిద్ద, చింతపట్ల, మొండిగౌరెల్లి, తులేఖుర్దు, తమ్మతలోనిగూడ, నల్లవెల్లి, మాల్, గున్గల్, కొత్తపల్లి గ్రామాల నుంచి రాకపోకలు కొనసాగించే బస్సులు నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నా యి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు వెళ్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు కాలం చెల్లిన బస్సులను నడుపుతుండడంతో అవి తరచూ ఏదో ఒకచోట మొరాయిస్తున్నాయి. డొక్కు బస్సుల జాయింట్ రాడ్లు విరిగిపోవడం, తరచూ టైర్లు పంక్చర్లు అవడం, స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త బస్సులను గ్రామాలకు నడపాలని విద్యార్థులు , ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బస్సులు సరిపడా నడపాలి
మండలంలో ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులు, ప్రయాణికులకు సరిపడా బస్సులను నడపాలి. ఉదయం తాటిపర్తి-ఇబ్రహీంపట్నం బస్సును కొనసాగించాలి. మధ్యాహ్నం 3.30లకు ఇబ్రహీంపట్నం-తాటిపర్తికి బస్సును నడపాలి. మేడిపల్లి, కొత్తపల్లి, తాటిపర్తి గ్రామాలకు తప్పనిసరిగా నైట్హాల్ట్లను కొనసాగించాలి. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో కొత్తవి నడిపించాలి. ఇప్పటికే ఈ సమస్యపై ఆర్ఎం, డీఎంకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తాం.
-పొద్దుటూరి రవీందర్గుప్తా, మేడిపల్లి
 
                            