మొయినాబాద్, డిసెంబర్ 28 : నిబంధనలను ఉల్లంఘించి పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఫామ్ హౌస్‌లను సీజ్ చేస్తామని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్‌గౌతం హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలకు ఫామ్ హౌస్‌లు ముస్తాబు అవుతున్న తరుణంతోపాటు సెలవు దినాల్లో నిర్వహించే పార్టీలకు వేదికగా ఫామ్ హౌస్‌లు నిలువడంతో రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్‌గౌతం,చేవెళ్ల డివిజన్ ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్, సురంగల్, మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ, శ్రీరాంనగర్, కుతుబుద్దీన్గూడ గ్రామాల్లోని 50 ఫామ్ హౌస్‌లలో శనివారం అర్ధరాత్రి వరకు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు.
అధికారుల ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 7గురు ఎస్ఐలు, 70 మంది సివిల్, ఏఆర్ పోలీసులు తనిఖీలు చేశారు. అజీజ్‌నగర్‌లోని జా ఫామ్ హౌస్‌లో, కుతుబుద్దీన్గూడ గ్రామంలోని గోల్డెన్ మీడోస్, గుణ ఫామ్ హౌస్‌లలో అనుమతులు లేకుండా మద్యంతోపాటు హుక్కా వినియోగిస్తున్నారని ఫామ్ హౌస్ యాజమానులు, నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లుగా సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా డీసీపీ యోగేశ్‌గౌతం మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలు నిర్వహించినప్పుడు మద్యం వినియోగిస్తే తప్పనిసరిగా అబ్కారీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. హుక్కా, గంజాయి వినియోగించడంతోపాటు గాంబ్లింగ్, బెట్టింగ్, వ్యభిచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు.