ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 22 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్, వైస్చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన వ్యవహారం హైకోర్టుకు చేరింది. అవిశ్వాస తీర్మానానికి ఒక్కరోజు ముందు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష నిర్వహించినా ఫలితాన్ని వెల్లడించొద్దని.. సమావేశంలో జరిగిన తీర్మానాలను సీల్డ్‌కవర్ ద్వారా సమర్పించాలని డీసీవోను ఆదేశించింది. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉద యం 11గంటలకు ఉప్పరిగూడ సహకారసంఘం కార్యాలయంలో డీసీవో దాత్రీదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టిన 11 మంది డైరెక్టర్లు హాజరై అవిశ్వాసానికే ఓటేసినట్లు తెలిసింది. ముందుగా డైరెక్టర్లు మినిట్ బుక్‌లో సంతకాలు చేశారు. సంతకాలు చేసిన మినిట్ బుక్, డైరెక్టర్ల సంతకాలతోపాటు ఫొటోలు, వీడియోలను సీల్డ్కవర్లో పొందుపర్చి డీసీవో హైకోర్టుకు అప్పగించారు. మార్చి 7న దీనిపై తుది నిర్ణయం వెలువడనున్నది. అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో 11 మంది డైరెక్టర్లు క్యాంపు నుంచి నేరుగా సహకారసంఘం కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే చైర్మన్ సుదర్శన్‌రెడ్డి కూడా బ్యాంకులోనే ఉన్నా సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది.
ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్, వైస్చైర్మన్లపై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 7న రాష్ట్ర అత్యు న్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనున్నది. అవిశ్వాసానికి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించగా బుధవారం స్టే ఇచ్చింది. బలపరీక్షను యథావిధిగా నిర్వహించాలని ఫలితాన్ని మాత్రం వెల్లడించొద్దని న్యాయస్థానం ఆదేశించింది.
దీంతో సహకార సంఘం అధికారులు గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి డైరెక్టర్లు చేసిన తీర్మానాన్ని గోప్యంగా ఉంచారు. అవిశ్వాసంపై చేసిన తీర్మానాల ఫొటోలు, వీడియోలను సీల్డ్‌కవర్ ద్వారా న్యాయస్థానానికి సమర్పించారు. మార్చి 7న హైకోర్టులో కేసు ఉన్నందున చైర్మన్, వైస్చైర్మన్లపై అవిశ్వాసానికి సంబంధించి తుది ఫలితం వెలువడనున్నది. అప్పటివరకు సుదర్శన్‌రెడ్డే చైర్మన్‌గా కొనసాగేలా కోర్టు ఆదేశాలిచ్చింది.
ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్, వైస్చైర్మన్లపై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస బలపరీక్ష సందర్భంగా గురువారం ఉప్పరిగూడ సహకార బ్యాంకు వద్ద పోలీసులు గట్టిబందోబస్తును ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ పీవీ రాజు, సీఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.