ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తు న్నా యూరియా కొరత మాత్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పులు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడం లేదు. ఈ పరిస్థితిలో రైతన్న బాధలు వర్ణణాతీతంగా మారాయి. పీఏసీఎస్‌లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొరగా అందుతున్న యూరియా పంటలకు సరిపోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
షాబాద్, సెప్టెంబర్ 1 : యూరియా కోసం కొన్ని రోజులుగా సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా అందకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. సోమవారం మండల కేంద్రంలోని సహకార సంఘానికి 450 బస్తాల యూరియా వచ్చింది. ఆ విషయం తెలియడంతో అన్నదాతలు అధిక సంఖ్యలో అక్కడికి వచ్చి క్యూలో నిల్చున్నారు. దీంతో అక్కడి సిబ్బంది పోలీస్ పహారాలో ఒక్కో రైతు కు రెండు సంచుల చొప్పున పంపిణీ చేశారు.
ఈ రెండు బస్తాల మందు పంటలకు ఏ మాత్రం సరిపోదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా దొరకని వారు నిరాశతో వెనుదిరిగారు. గత కేసీఆర్ హయాంలో ఎప్పుడూ ఈ సమస్య రాలేదని.. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచే అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారని మండిపడ్డారు.
సరిపడా అందించాలి..
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు సరిపడా ఎరువులు అందించకపోవడంతో సిగ్గుచేటు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కూడా రైతులకు ఎరువుల కొరత లేకుండే. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. రైతులు యూరియా కోసం రోడ్డుపై ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా..? క్యూలో నిలబడి రెండు సంచులు యూరియా తీసుకుపోతే పంటలకు ఏమి సరిపోతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి.
-భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత, షాబాద్
పెద్దేముల్లో తొక్కిసలాట.. స్పృహ తప్పిన రైతు
పెద్దేముల్ : మండల కేంద్రంలోని రైతు సహకార కేంద్రంలో యూరి యా పంపిణీ చేయడంతో అన్నదాతలు అధికంగా వచ్చి క్యూలో నిల్చున్నారు. వచ్చిన యూరియా స్టాకు తక్కువగా ఉండడంతో తమ కు ఎరువు దొరుకుతుందో లేదోననే అనుమానంతో అక్కడ తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో జనగాం గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న అతడి గ్రామానికి చెందిన వారు ఆటోలో స్థానికంగా ఉన్న ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు.
తోపులాట
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద అన్నదాతలు సోమవారం ఉదయం నుంచే బారులుతీరారు. దీంతో అక్కడ కొంత సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతులు ఒకరినొక్కరూ తోసుకున్నారు. పోలీస్ పహారాలో అధికారులు రైతులకు యూరియాను పంపిణీ చేశారు. పీఏసీఎస్ కార్యాలయానికి 450, కేశంపేట రోడ్డులోని ఆగ్రోరైతు సేవా కేంద్రానికి 220, ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద ఆగ్రోరై సేవా కేంద్రానికి 220 మొత్తం 890 బస్తాల యూరియా రాగ.. ఒక్కో రెండు బస్తాల చొప్పున పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయాధికారి నిశాంత్‌కుమార్ తెలిపారు. ఫరూఖ్‌నగర్ మండలానికి మొత్తం 60,777 బస్తాలకుగాను ఇప్పటి వరకు 40, 200 బస్తాలు వచ్చిందని.. దానిని ఇప్పటికే అందజేశామన్నారు.
గందరగోళం మధ్య పంపిణీ
కేశంపేట : మండలంలోని రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పీఏసీఎస్‌కు 450 బస్తాల యూరియా మాత్రమే రావడం.. అక్కడ వేల సం ఖ్యలో రైతులు గుమిగూడడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో కేశంపేట సీఐ నరహరి సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను అదుపు చేశారు. రైతులందరికీ యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.
క్యూలో ఉన్నా అందడంలేదు..
యూరియా కోసం రోజుల తరబడిగా ఎదురుచూస్తున్నా. వచ్చిన యూరి యా వచ్చినట్టే అయిపోతున్నది. క్యూలో నిలబడినా అందడంలేదు. లైన్ లో వృద్ధులు, మహిళలు నిలబడలేకపోతున్నారు. పంటలకు అదును కు యూరియా వేస్తేనే మంచిగా ఉంటుంది. లేకుంటే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అనంతరాములు, అన్నారం, ఫరూఖ్‌నగర్
ఇబ్బందుల్లేకుండా చూడాలి
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండడంతో పంటలకు సరిపోవడంలేదు. రైతులకు సరిపడా అందించాలి.
-రాంచంద్రయ్య, కిషన్‌నగర్, ఫరూఖ్‌నగర్
ఉదయం నుంచే భారీగా క్యూ..
ధారూరు : మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద అన్నదాతలు ఉదయం నుంచే ఎరువుకోసం పడిగాపులు కాశారు. అక్కడికి 450 బస్తాల యూరియా రాగా.. తమకు దొరుకుతుందో లేదోననే అనుమానంతో ఒకరినొకరు తోసుకున్నారు. కాగా, పోలీసు పహారాలో ఒక్కో రైతుకు రెండు సంచుల చొప్పున పంపిణీ చేశారు. కాగా, క్యూలో ఉండి యూరియా దొరకని దాదాపు 80 మంది రైతులకు అక్కడి సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. యూరియా లోడ్ రాగానే మీకే ముందుగా ఎరువును ఇస్తామని చెప్పారు.
మొయినాబాద్‌లో ఎగబడిన రైతులు
మొయినాబాద్ : మొయినాబాద్ పీఏసీఎస్ వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి యూరియాను పంపిణీ చేస్తామని అక్కడి సిబ్బంది చెప్పడంతో అన్నదాతలు సోమవారం తెల్లవారుజాము నుంచే అక్కడ భారీగా క్యూ కట్టి నిరీక్షించారు. కాగా, మండలానికి 100 టన్నులు అవసరముంటే కేవలం 20 టన్నులు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. దీంతో అక్కడి సిబ్బంది ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.