షాబాద్, మే 16 : సర్దార్నగర్లో ధాన్యం కొనుగోలు(Grain purchase )కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ షాబాద్ మండల అధ్యక్షుడు దండు యాదవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ మధుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, షాబాద్ మండలంలో ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు.
ఈ ప్రాంతంలో వడ్లు పండించిన రైతులు బయటి మార్కెట్లో రూ.1500 నుండి రూ.1800 వరకు క్వింటాల్ ధర అమ్ముకుంటు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత ఏడాది రైతులు ప్రభుత్వానికి వడ్లు ఇవ్వలేదు కాబట్టి, ఈ ఏడాది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని సాకులు చెబుతున్నారని, లాభదాయకంగా వడ్లు అమ్ముకునే వెసులుబాటు రైతులకు ఉంటుందని ప్రభుత్వం గమనించాలన్నారు. ఫ్రైవేట్ మార్కెట్లో లాభాలు వచ్చిన ప్రభుత్వానికే ధాన్యం ఇవ్వాలనే విధానం రైతుల పట్ల వ్యతిరేకత అని రైతులు భావిస్తున్నారన్నారు.
అదే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు చేయకపోవడం వల్ల రూ.500 బోనస్ కూడా నష్టపోతున్నారని వాపోయారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే సర్దార్నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల వద్ద వడ్లు సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణరెడ్డి, చేగూరు వెంకట్రెడ్డి, ఓగ్గు మల్లయ్య, అంతిరెడ్డిగూడెం చంద్రయ్య, ముత్యం నర్సింహులు, సత్యంగౌడ్, దొండ్ర కృష్ణ, చంద్రకళ, ఇతర రైతులు తదితరులు పాల్గొన్నారు.