పాల బిల్లుల కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. జిల్లాలో వేలాది మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పాడి పరిశ్రమను ఏర్పాటు చేశారు. అలాగే, కొంతమంది ఇండ్ల వద్దే ఆవులు, గేదెలను పెంచుకుంటూ పాలను ఆయా బూత్‌ల్లో పోసి జీవనోపాధి పొందుతున్నారు. కానీ, నెలల తరబడిగా పాలను సేకరిస్తున్న మదర్, విజయ డెయిరీలు బిల్లులను సక్రమంగా చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆవులు, గేదెల పోషణ కష్టంగా మారిందని, వాటికి దాణాను తీసుకురావాలన్నా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో మదర్ డెయిరీ, విజయ డెయిరీ, అమూల్, వల్లభ, హెరిటేజ్, తిరుమల, మస్కతి వంటివి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా మదర్, విజయ డెయిరీలు గ్రామాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసుకుని మరీ రైతు ల నుంచి పాలను సేకరిస్తున్నాయి. బిల్లులను 15 రోజులకోసారి చెల్లిస్తాయి. అయితే, ఇటీవల మదర్, విజయ డెయిరీలు సరైన లాభాల్లేక.. ఆర్థిక సంక్షోభంలో ఉండడంతో రైతులకు సకాలంలో బిల్లులను చెల్లించడంలేదు. మదర్ డెయిరీ ఇబ్రహీంపట్నం, మంచా ల, యాచారం, మాడ్గుల తదితర మండలాల్లో పాలను సేకరిస్తుండగా, విజయ డెయిరీ షాద్‌నగర్, కొందుర్గు, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొత్తూరు, నందిగామ, చౌదరిగూడ వంటి మండలాల నుంచి పాలను సేకరిస్తున్నది.
కాగా, మదర్ డెయిరీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దాదాపుగా రూ. 1,00,00,000 నుంచి రూ. 1,50,00,000 బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. దీంతో రైతులకు పాల బిల్లులను సక్రమంగా చెల్లించలేకపోతున్నామని ఆ సంస్థ డైరెక్టర్ కూడా అంగీకరించారు. జనవరి నెల మొత్తం, ఫిబ్రవరి ఇప్పటివరకు రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. యా చారం మండలంలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన రైతులు తమకు రావాల్సిన సుమారు రూ.30 లక్షలు వెంటనే చెల్లించాలని తమ పాలను రోడ్డు పై పోసి ఇటీవల వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అదేవిధంగా, విజయ డెయిరీ కూడా రూ. 25 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. తమ డబ్బులను వెంటనే చెల్లించాలని అన్నదాతలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిల గురిం చి ఎవరిని అడగాలో తెలియక కడ్తాల్ మండలానికి చెందిన రైతులు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నేతృత్వంలో రోడ్డుపై పాలను పారబోసి ఇటీవల నిరసన తెలిపారు.
రైతును రాజుగా చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసింది. కానీ, అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఇబ్బందిపెడుతున్నది. సకాలంలో పెట్టుబడి సాయాన్ని అందించక.. ఎరువులు, విత్తనాలనూ అందుబాటు ఉంచక.. మరోవైపు రైతులకు అందాల్సిన బోనస్ డబ్బులనూ బ్యాంకు ఖాతాల్లో జమచేయక..పాడి పరిశ్రమనే నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు బిల్లులను చెల్లించక వారిని మనోవేదనకు గురిచేస్తున్నది.
పాల బిల్లులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నాం. పాడి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న తనలాంటి ఎంతోమంది అన్నదాతలు మదర్, విజయ డెయిరీలకు ప్రతిరోజూ పాలను పోస్తున్నారు. అయితే ఆ రెండు సంస్థలు ప్రతినెలా సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందు లు పడుతున్నాం. పశుపోషణ కూడా కష్టంగా మారుతున్నది. కుటుంబం నడవడం ఇబ్బంది అవుతున్నది.
-వరప్రసాద్‌రెడ్డి, నజ్దిక్‌సింగారం
సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నా. ప్రతిరోజూ కడ్తాల్ గ్రామంలోని విజయ డెయి రీ పాల సేకరణ కేంద్రంలో 40 లీటర్ల పాలు పోస్తా. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.10 లక్షలు బాకీ ఉన్నది . కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి పాల బిల్లులు సమయానికి చెల్లించడంలేదు. దీంతో ఆవులకు దాణా, మందులు, కుటుంబ ఖర్చులకు కష్టంగా మారింది.
-బాచిరెడ్డి-బాచిరెడ్డి అశోక్‌రెడ్డి, పాడి రైతు, కడ్తాల్
ఎన్నో ఏండ్లుగా పాడి పరిశ్రమనే నమ్ముకుని జీవిస్తున్నా. ప్రతిరోజూ విజయ డెయిరీలో వంద లీటర్లకుపైగా పాలు పో స్తా. రూ.2,20,000 పాల బిల్లు పెండింగ్‌లో ఉన్నది. సక్రమం గా డబ్బులు చెల్లించకపోవడం తో పశు పోషణతోపాటు, కుటుంబాన్ని నడపడం కష్టంగా మారింది. పిల్లల స్కూల్ ఫీజు లు, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రేవంత్ సర్కార్ కంటే.. బీఆర్ఎస్ పాలనే నయం. అప్పుడు పాడి రైతులు రాజులాగా బతికారు.
-కాకర్ల సత్యం, పాడి రైతు, కడ్తాల్