Kadtal | కడ్తాల్, మార్చి 26 : సకాలంలో పాల బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే పాల బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ నేత చంద్రశేఖరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం తలకొండపల్లి మండల పరిధిలోని గట్టుఇప్పలపల్లి గ్రామంలో పాడి రైతులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. నిర్ణీత సమాయానికి పాల బిల్లుల చెల్లించకుండా పాడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని తెలిపారు. 70 రోజులుకు పైగా పాల బిల్లులు రాకపోవడంతో పాడి రైతులకు పశు పోషణ భారమై, అప్పులు చేయాల్సిన పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాల బిల్లులు రాకపోవడంతో పశువులకు దాణ, మేత, మందుల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. బకాయి ఉన్న పాల బిల్లులను చెల్లించని పక్షంలో పాడి రైతుల పక్షాన మండలంలో నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు జంగయ్య, కృష్ణయ్య, అశోక్‌గౌడ్, కొండల్, జీవా, లక్షీపతి, విజేందర్, మల్లేశ్, వెంకటయ్య, హరికృష్ణ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.