సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : సెల్‌ఫోన్‌కు మేసేజ్ వచ్చిందంటే అందులో ఏముందో అని చాలా మంది ఓపెన్ చేస్తుంటారు. దీనినే సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ఆర్టీవో చాలన్. ఏపీకే, హెచ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ. ఏపీకే, పీఎం కిసాన్. ఏపీకే ఇలా వివిధ రకాలైన ప్రభుత్వ గుర్తింపున్న సంస్థలు, పథకాల పేరుతో వైరస్తోఏపీ ఎక్స్టెన్సన్తో కూడిన ఫైల్స్‌ను పంపిస్తూ సామాన్యుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు ప్రతి రోజూ సైబర్ఠాణాలకు వస్తున్నాయి. ఏపీకే ఫైల్స్‌తో సెల్‌ఫోన్‌ను హ్యాకింగ్ చేసే వైరస్‌తో కూడిన సాఫ్ట్‌వేర్‌ను పంపిస్తూ ఫోన్లును హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసిన ఫోన్లలోని ఓటీపీలను తెలుసుకుంటూ బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల్లోని నగదును సైబర్‌నేరగాళ్లు ఈజీగా ఖాళీ చేస్తున్నారు. కొన్నిసార్లు బాధితులకు తెలియకుండానే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఖాతాలు ఖాళీ అయిన తరువాత చాలా మంది బాధితులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తూ తమకు ఓటీపీ రాలేదంటూ చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో తమ సెల్ఫోన్లకు వచ్చిన ఓటీపీలను బాధితులే స్వయంగా సైబర్‌నేరగాళ్లకు చెబుతున్న ఘటనలుంటున్నాయి. సైబర్‌నేరగాళ్ల చేతిలోకి ఫోన్ యాక్టివిటీ మొత్తం వెళ్తుండడంతో ఖాతాలను నేరగాళ్లు ఈజీగా ఖాళీ చేస్తున్నారు. బాధితులకు పేరున్న ప్రభుత్వ స్కీమ్‌లు, సంస్థల పేర్లతో మేసేజ్‌లు వస్తుండడంతో అందులో ఏమో ఉందనే ఉద్దేశంతో వాటిని క్లిక్ చేస్తున్నారు. ఇంటర్నెట్లో వివిధ పనుల కోసం బాధితులు శోధిస్తుంటారు. ఇలాంటి వారి డాటానుకూడా సైబర్‌నేరగాళ్లు సేకరిస్తున్నారు.
సాధారణంగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, సాఫ్ట్వేర్ తయారు చేసే క్రమంలో రెండు వేరు వేరు ఫైల్స్‌ను, రెండు మాడ్యుల్స్‌ను కలపడంలో ఏపీకే ఫైల్స్‌ను వాడుతుంటారు. అయితే దీనిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ అందులో వైరస్‌తో కూడిన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తున్నారు. ఈ ఫైల్స్‌ను అమాయకుల సెల్ఫోన్లకు పంపిస్తున్నారు. తెలియని వాళ్లు ఈ ఫైల్స్‌ను క్లిక్ చేయడంతో ఆ ఫోన్లో నేరగాళ్లు తయారు చేసిన హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్‌ను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్స్‌తో బ్యాంకు ఖాతాలతో పాటు సెల్‌ఫోన్‌లోని ఇతర ముఖ్యమైన డాటాను సైతం నేరగాళ్లు అపహరించే అవకాశాలున్నాయని పోలీసులు సూచిస్తున్నారు.
ఆర్టీవో చలాన్ పేరుతో ఆర్టీఓఈ చలాన్.ఏపీకే పేరుతో ఒక యాప్ లింక్ 47ఏళ్ల వ్యక్తి మొబైల్‌కు వచ్చింది. దీనిని చూసి చలాన్ పడిందేమో చూద్దామని ఓపెన్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అయింది.
దీంతో తెలియక ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే అతని హెచ్డీఎఫ్సి అకౌంట్ నుంచి రూ.1.82లక్షలు పోయినట్లు బాధితుడు తెలిపారు. నగరానికి చెందిన మరో వ్యక్తికి ఇదే యాప్ లింక్ రాగా అతను ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయగానే తన అకౌంట్ నుంచి రూ.1లక్ష పోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు.
కోర్ట్ ఆర్డర్ ఆర్టీవో ఏపీకే, పిఎం కిసాన్. ఏపికె పేరుతో ఇద్దరు బాధితులకు వేరు వేరుగా వచ్చిన రెండు లింకులను చూసిన బాధితులు వాటిని ఓపెన్ చేశారు. దీంతో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.2.03 లక్షలు కొట్టేయగా , మరో బాధితుడి ఖాతా నుంచి రూ.4.85లక్షలు సైబర్‌నేరగాళ్లు కొట్టేశారు.
ఓ రైతు ఫోన్‌కు ఆర్టీవో చలాన్.ఏపీకే ఫైల్‌ను పంపించిన సైబర్‌నేరగాళ్లు అతని ఖాతాలో నుంచి రూ. 5.65 లక్షలు కాజేశారు. వాట్సాప్ నంబర్‌కు ఆర్టీవో చాలన్. ఏపీకే పేరుతో లింక్ రావడంతో ఆర్టీఓకు సంబంధించిందని భావించిన బాధితుడు దానిని క్లిక్ చేయడంతో అతని హెచ్డీఎఫ్సీ ఖాతాలో నుంచి రూ. 5.65 లక్షలు ఖాళీ అయ్యాయి.
మల్కాజిగిరికి చెందిన బాధితుడి ఫోన్‌కు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ పేరుతో మేసేజ్ పంపించారు. అందులో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ.ఏపీకే ఫైల్ ఉండడంతో ఆ మేసేజ్‌ను క్లిక్ చేశాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆయన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో నుంచి దఫ దఫాలుగా రూ. 2 లక్షలు ఖాళీ అయ్యాయి.