పూడూరు : వందల సంఖ్యలో యువకులు నాలుగు నెలల నుంచి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో యువకులను వలలో వేసుకోడానికి ఇంటి వద్దే ఉపాధి అంటూ ఆన్లైన్లో ప్రచారం చేశారు. దీంతో కొందరు యువకులు ఆశపడి లైమ్ కంపెనీ యాప్‌ను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మొదటగా రూ. 5వేలు చెల్లిస్తే రూ. 10వేలు వస్తాయని ఆశతో ఆన్లైన్ ద్వారా చెల్లించారు. ముందుగా చెల్లించిన కొంతమంది యువకులకు రూ. 5వేలకు రూ. 10 వేలు వారి ఆన్లైన్ అకౌంట్లో వేసి ఆశచూపారు. దీంతో కొందరు యువకులు తమ స్నేహితులకు ఈ యాప్ ద్వారా అధిక డబ్బులు వస్తున్నాయని ప్రచారం చేశారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కడ్మూరు గ్రామానికి చెందిన సుమారు 200మంది యువకులు ఆన్లైన్లో లైమ్ కంపెనీ లింక్‌ను ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకున్నారు. కొందరు అత్యాశపడి రూ. 10వేల నుంచి రూ. లక్షల వరకు ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో జమ చేశారు. గ్రామానికి చెందిన సాంబ అనే యువకుడు గత సంవత్సరం 19/11/2021న రూ. 5,500లు చెల్లించగా అతనికి 20రోజుల్లో రూ. 14వేలు ఆన్లైన్ ఖాతాలో సైబర్ నేరగాళ్లు వేశారు. ఆ యువకుడు డబ్బులు వచ్చిన వెంటనే ఆన్లైన్ ఖాతా నుంచి తమ బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకొని, మళ్లీ అధిక డబ్బులకు ఆశపడి డబ్బులు జమ చేశాడు. డిసెంబర్ 31న డబ్బుల కోసం చూసుకుంటే యాప్ పని చేయకపోవడంతో మోసం జరిగినట్లు గుర్తించారు.
దీంతో గ్రామంలో డబ్బులు చెల్లించిన యువకులందరూ పెద్ద ఎత్తున మోసపోయినట్లు గుర్తించి ఆందోళ చెందారు. బాధితులు కొందరు మాట్లాడుతూ సీమా అనే మహిళ న్యూ ఇయర్ ఆఫర్ అంటూ యువకులతో వాట్సాప్ చాట్ చేశారు. గ్రామంలో సుమారుగా 200 మంది వరకు, దాదాపు కోటి రూపాయల డబ్బులు పోగొట్టుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధికంగా డబ్బులు వస్తున్నాయని ఆశతో కొంతమంది యువకులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. మోసపోయిన విషయం తెలుసుకున్న కొందరు యువకులు హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ బ్రాంచ్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై చన్గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీశైలంను వివరణ కోరగా.. కడ్మూరు గ్రామంలోని కొంతమంది యువకులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయం నిజమే. బాధితులు తమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా సైబర్ కైమ్ బ్రాంచ్‌కు 7మంది బాధితులు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి స్టేషన్‌కు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు కడ్మూరు గ్రామానికి వెళ్లి బాధితులను కలిసి జరిగిన విషయంపై ఆరా తీస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డబ్బులకు ఆశపడి మోసపోయాం.. ఎం. సాంబ, కడ్మూరు
లైమ్ యాప్ ద్వారా తక్కువ జబ్బులు జమ చేస్తే అధికంగా డబ్బులు వస్తాయని ఆశపడ్డాను. నాలుగు నెలల క్రితం ఈ యాప్ ద్వారా అధిక డబ్బులు వస్తున్నట్లు తెలుసుకున్నాను. రూ. 5వేల చెల్లించడంతో కొన్ని రోజుల తరువాత రూ. 10వేల వరకు వచ్చాయి. మళ్లీ డబ్బులు కట్టి చూసుకోగా యాప్ పని చేయకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించాము. గ్రామంలోని పలువురు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలిసింది.