రంగారెడ్డి, మే 22(నమస్తే తెలంగాణ) : ‘కేంద్ర ప్రభుత్వ పథకాల తీరు ‘ఆర్భాటమే తప్ప.. ఆచరణ శూన్యం’ అన్నట్లుగా ఉంటున్నది. ఇందుకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకమే ఉదాహరణ. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని చేపట్టినప్పటికీ అమలులో మాత్రం బోల్తా పడింది. 2019లో విధించిన నిబంధనలను కేంద్రం సడలించకపోవడంతో ఈ పథకం కింద కొంతమంది రైతులకే ప్రయోజనం చేకూరుతున్నది. రంగారెడ్డి జిల్లాలో 2018లో మొదటి విడుతలో 1,93,189 మందికి రూ.38.63కోట్ల సాయాన్ని కేంద్రం అందించగా.. 15వ విడుతకు వచ్చేసరికి లబ్ధిపొందుతున్న రైతుల సంఖ్య 1,14,055 మందికి తగ్గింది.
కేంద్రం 2018 సంవత్సరం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కొత్త పథకాన్ని అమలు చేసింది. ఏటా మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున రూ.6వేలను అందజేస్తున్నది. మొదటి సంవత్సరం ఒక విడుతలోనే రూ.2వేల చొప్పున 1,93,189 మందికి రూ.38.63కోట్లను అందించింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి సాయం పొందే రైతుల సంఖ్య క్రమక్రమేణా తగ్గుతూ వస్తున్నది. 15వ విడుతలో 1,14,055 మంది రైతులకు రూ.22.81కోట్ల సాయం అందింది. ప్రస్తుతం 16వ విడుత పంపిణీ కార్యక్రమం కొనసాగుతుండగా.. మే 22 వరకు 88,672 మంది రైతులకు రూ.17.73కోట్ల సాయం మాత్రమే అందింది. పంపిణీ పూర్తయ్యే సరికి రైతుల సంఖ్య లక్షలోపే ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదన ప్రజల్లో వినిపిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకం అర్హతకు సవాలక్ష ఆంక్షలు, నిబంధనలను పెట్టింది. 2019 ఫిబ్రవరిలోపు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అర్హులని నిర్ణయించడంతో ఆతర్వాత పాసు పుస్తకాలు పొందిన చాలామంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద సాయాన్ని పొందలేక పోయారు.
ఈ పథకం కింద సాయం పొందుతున్న రైతులు ఆదాయ పన్ను చెల్లించినా, మరణించినా, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ఆటోమెటిక్‌గా రైతుల పేరు తొలగిపోతున్నది. ఒకే కుటుంబంలో ఇద్దరి వ్యక్తుల పేరిట భూములు ఉంటే ఒక్కరికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. 2019 తర్వాత కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలను పొందినవారు పీఎం కిసాన్ పథకం కింద సాయం పొందలేక పోతున్నారు. పథకం అమలు చేసే సమయంలో ఖరారు చేసిన నిబంధనల్లో మార్పులు చేయకపోవడమే ఇందుకు కారణం. కేంద్ర విధానంపై జిల్లా రైతాంగం మండిపోతున్నది.
