వికారాబాద్, జూన్ 19, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక వృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పండ్ల తోటలను పెంచేందుకు నిర్ణయించింది. అయితే జిల్లాలో పండ్ల తోటలను పెంచేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికిగాను టార్గెట్‌ను నిర్దేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అర్హులైన రైతులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర చిన్న, సన్నకారు రైతులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే పండ్ల తోటలను సాగు చేసేందుకు అధికారులు వంద శాతం సబ్సిడీని అందిస్తున్నారు.
అయితే పండ్ల తోటల పెంపకానికి గుంతలు తీయడం మొదలు.. మొక్కలు నాటడం, ఊత కర్ర కట్టడం, మొక్కలు కొనుగోలుకు, ఎరువులు వేయడానికి, నెల నెలా పర్యవేక్షణ ఈ విధంగా మూడేండ్ల్ల వరకు వంద శాతం సబ్సిడీని ఉపాధి హామీ ద్వారా ఇవ్వనున్నారు. మున్సిపాలిటీలు మినహా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్న, సన్నకారు రైతులు పండ్ల తోటల సాగుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే జిల్లావ్యాప్తంగా 900 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటివరకు 50 శాతానికిపైగా గుర్తింపు ప్రక్రియ పూర్తికాగా, వారం, పది రోజుల్లో రైతుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తున్నది.
పండ్ల తోటల పెంపకంలోనే కాకుండా మైక్రో ఇరిగేషన్‌కు కూడా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్‌ను పండ్ల తోటల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అయితే గతేడాది నిధులు లేకపోవడంతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయలేకపోయారు. మరి ఈ ఏడాది గుర్తించిన రైతుల పండ్ల తోటలకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తారా లేదనేది నిర్ణయించాల్సి ఉన్నది. మరోవైపు పండ్ల తోటల పెంపకానికి అర్హులైన రైతులు స్థానిక ఎంపీడీవో లేదా ఏపీవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి సంబంధించి అర్హులైన రైతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన ప్రకారం జిల్లాలోని అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా 900 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటివరకు 636 ఎకరాలకు సంబంధించి అర్హులైన రైతులను గుర్తించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన రైతులకు సంబంధించి.. బంట్వారం మండలంలో 11 మంది రైతులు 33 ఎకరాలు, బషీరాబాద్‌లో 6 మంది రైతులకు సంబంధించిన 10 ఎకరాలు, బొంరాస్‌పేటలో 21 మంది రైతులు 41 ఎకరాలు,
ధారూరు మండలంలో 29 మంది రైతులు 38 ఎకరాలు, దోమ మండలంలో 16 మంది రైతులు 33 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 8 మంది రైతులు 20 ఎకరాలు, కొడంగల్ మండలంలో 10 మంది రైతులు 26 ఎకరాలు, కోట్‌పల్లి మండలంలో 20 మంది రైతులు 22 ఎకరాలు, కులకచర్ల మండలంలో 32 మంది రైతులు 76 ఎకరాలు, మర్పల్లి మండలంలో 16 మంది రైతులు 25 ఎకరాలు, మోమిన్‌పేట మండలంలో 38 మంది రైతులు 38 ఎకరాలు, నవాబ్‌పేట మండలంలో 60 మంది రైతులు 50 ఎకరాలు, పరిగి మండలంలో 19 మంది రైతులు 34 ఎకరాలు, పెద్దేముల్ మండలంలో 26 మంది రైతులు 55 ఎకరాలు, పూడూరు మండలంలో 23 మంది రైతులు 35 ఎకరాలు, తాండూరు మండలంలో 12 మంది రైతులు 30 ఎకరాలు, వికారాబాద్ మండలంలో 42 మంది రైతులు 51 ఎకరాలు, యాలాల్ మండలంలో 21 రైతులకు చెందిన 22 ఎకరాలను జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు గుర్తించింది.
ఆయా జిల్లాల్లో నేలల స్వభావాన్ని బట్టి పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 12 రకాల పండ్ల తోటలను పెంచేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. జిల్లాలో చాలా వరకు ఎర్ర, నల్లరేగడి నేలలున్న దృష్ట్యా మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, మునగ, కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్, సపోటా, ఆయిల్ పామ్, బత్తాయి, అల్లనేరేడు పండ్ల తోటలను పెంచేందుకు నిర్ణయించారు.
– డీఆర్డీవో శ్రీనివాస్
పండ్ల తోటల పెంపకానికి సంబంధించి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం నిర్ణయించిందని, అంతేకాకుండా మైక్రో ఇరిగేషన్‌కు కూడా ఉద్యానవన శాఖ ద్వారా వంద శాతం సబ్సిడీని అందిస్తుందన్నారు. వీలైనంతా త్వరితగతిన అర్హులైన రైతులను గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తామని డీఆర్డీవో తెలిపారు. ఇప్పటికే గుర్తించిన భూముల్లో గుంతలు తీసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు.
పండ్ల తోటల పెంపకానికి సంబంధించి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర చిన్న, సన్నకారు రైతులను అర్హులుగా నిర్ణయించింది. అయితే 5 ఎకరాలలోపు భూమిగల రైతులను ఈ పథకానికి ఎంపిక చేస్తున్నారు. కుటుంబంలోని సభ్యుల భూమి మొత్తం ఐదెకరాలలోపు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండాలని, బోరు బావి కలిగి విద్యుత్తు సదుపాయం ఉన్నవారికి ఈ పథకం కింద జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం గుర్తిస్తున్నది. మరోవైపు అర్హులైన రైతులు రైతు దరఖాస్తు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, బ్యాంకు ఖాతా బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ కాపీలతోపాటు మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో సంబంధిత గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవో లేదా ఏపీవోలకు సమర్పించాల్సి ఉంటుంది.