ఇబ్రహీంపట్నం : గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులువేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాలల్లో రూ. 1.30కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో గడిచిన ఆరు నెలల్లో 2604 రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం బీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తుందన్నారు. ఈ బీమా ద్వారా రైతులకు ఏడాదికి పన్నెండువందల కోట్లు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
తెలంగాణలో రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అలాగే, రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్రంలో 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆరువేల ఐదు వందల కోట్ల నిధులు గ్రామాలకు నేరుగా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలాగే, గ్రామాల్లో చెత్తసేకరణ కోసం 12769 గ్రామాలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలను సమకూర్చడం జరిగిందని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో 116కోట్ల వ్యయంతో 19478 పల్లె ప్రకృతి వనాలు నిర్మించడం జరిగిందన్నారు. అలాగే 1554కోట్లతో 12728గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించడం జరిగిందన్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 319కోట్లతో 12776 డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
దళితబంధు పథకం చరిత్రలో నిలిచిపోతుంది..
రాష్ట్రంలో దళితులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆమె అన్నారు. అలాగే రాష్ట్రంలోని రజకులకు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం ఇస్తుందన్నారు. మత్యకారులకు సకాలంలో చేపలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.
రూ. 1.30కోట్లతో అభివృద్ధి పనులు
మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ. 1.30కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని అన్నారు. నాగారంలో అంగన్వాడీ భవనం, ఏనుగు చెర్వుతండా, తీగలకుంట తండా, పడమటి తండా, దిల్వార్గూడ గ్రామ పంచాయతీల్లో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.