గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగినట్లు జిల్లా పోలీసు అధికారి కె.నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వార్షిక క్రైమ్ నివేదికను విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 630 నేరాలు పెరిగినట్లు, వాటిలో అధికంగా సైబర్ నేరాలతోపాటు సాధారణ దొంగతనాలు, అత్యాచార, కిడ్నాప్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. గతే డాది 3,600 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 4,230 కేసులు ఎంట్రీ అయ్యాయని.. సైబర్ నేరాలు 889 కేసులు నమోదు కాగా.. రూ.4.34 కోట్ల వరకు సైబర్ కేటుగాళ్లు కొట్టేశారని, వాటిలో ఇప్పటివరకు రూ. 29.60 లక్షలను బాధితులకు రిఫండ్ చేసినట్లు ఎస్పీ వివరించారు. సైబర్ నేరాలను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు 964 కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
-వికారాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)
మరోవైపు జిల్లాలో రోడ్డు ప్రమాదాల కేసులు గతేడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు. గతేడాది 189 రోడ్డు యాక్సిడెంట్లు జరిగి.. 205 మరణాలు నమోదుకాగా.. ఈ ఏడాది 165 రోడ్డు ప్రమాదాల్లో 169 మంది మృతి చెందారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు 4,728 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ-చలాన్లు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది 386 కేసులు నమోదుకాగా వాటిలో ఐదు కేసుల్లో కోర్టు జీవితఖైదు విధించిందన్నారు. అదేవిధంగా ఆత్మహత్యల కేసులూ తగ్గాయన్నారు. గతేడాది 222 ఆత్మహత్య కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 176 కేసులు నమోదయ్యాయన్నారు.
టాస్క్‌ఫోర్స్ బృందాన్ని మరింత బలోపేతం చేసి జిల్లాలో జరుగుతున్న ఇసుక, కలప అక్రమ రవాణా, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ నారాయణరెడ్డి వెల్లడిం చారు. ఈ ఏడాది భారీగా నకిలీ విత్తనాలు, గంజాయి, కల్తీ టీ పొడి, పీడీఎస్ బియ్యం, కల్తీ కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది 158 కేసులు నమోదు చేసి 502 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా జిల్లాలో ఈ ఏడాది అనేక చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, పలు కేసులను వాటి ద్వారా ఛేదించినట్లు ఎస్పీ వివరించారు. 150 కేసుల్లో నిందితుడిగా ఉన్న చైన్స్నాచర్ను కర్ణాటకలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారన్నారు. అదేవిధంగా ఈ ఏడాది జిల్లాలో 10 కార్డెన్‌సెర్చ్‌లు నిర్వహించి 585 వాహనాలను సీజ్ చేసి, జరిమానా విధించామన్నారు.
జిల్లాలో ఈ ఏడాది డయల్ 100కు 31,255 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో 166 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా.. 1356 కాల్స్‌ను పరిష్కరించామని, మరో 29,733 కాల్స్ రాజీపడినట్లు చెప్పారు. మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. మహిళల ఫిర్యాదుపై తక్షణమే స్పందించి 72 కిడ్నాప్, 64 రేప్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ పనిచేస్తున్నాయని, ఈ ఏడాది 29 పెట్టి కేసులు, 7 ఎఫ్ఐఆర్లు, 283 అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వికారాబాద్, తాండూరులలో పెరిగిన వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఠాణాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపానలను అందజేశామని, వచ్చే ఏడాది ఏ పోలీస్ స్టేషన్లోనైనా కేసు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపడుతామని, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా ముందుకెళ్తామని ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు.