రంగారెడ్డి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు కార్యక్రమం ఎంతో బృహత్తర కార్యక్రమమని.. దీని ద్వారా ప్రతిరోజూ వేలాది మంది వృద్ధులు, మహి ళలు కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నా రు. జిల్లాను అంధత్వ రహితంగా మార్చేందుకు అధికారులు, సిబ్బంది ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ఏడు అంశాలపై జరిగిన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, విద్యావైద్యం, ఆర్థిక, ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్పీచైర్‌పర్సన్ అనితారెడ్డి పలు అభివృద్ధి కార్యకలాపాలు – అంశాలపై వివరాలను సేకరించి, అధికారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. శిబిరాల్లో పంపిణీ చేస్తున్న కంటి అద్దాలు చాలా బాగున్నాయని ఆమె కితాబిచ్చారు. ప్రతిరోజూ పదివేల మంది వరకు లబ్ధి పొందుతున్నారన్నారు.
‘కంటి వెలుగు’పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరిన్ని సమీక్షలు, సమావేశాలు నిర్వహించి పేదలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సర్జరీలు సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా వైద్య కో-ఆర్డినేటర్ వరదాచారిని ఆదేశించా రు. జిల్లాలోని 20 కేవీబీవీ పాఠశాలల్లో మంచి భోజన వసతి కల్పించాలని అధికారులకు సూచించారు. బాలబాలికలకు ‘గుడ్ టచ్- బ్యాడ్ టచ్’ పై అవగాహన కల్పిస్తున్న వయోజన విద్యాశాఖ అధికారులను అనితారెడ్డి అభినందించారు.
పరీక్షల సమయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. గత సమావేశాల్లో చెప్పిన చిన్న, చిన్న విద్యుత్తు సమస్యలను పరిష్కరించినందుకు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్‌ను ఆమె అభినందించారు. పొరుగు రాష్ర్టాల్లో కొనసాగుతున్న డ్వాక్రా గ్రూపుల వివరాలను అందజేయడంతోపాటు కొత్త మహిళా సంఘాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డుల్లో తడి, పొడిగా వేసి చేసి ఎరువును తయారు చేయాలన్నారు.
ప్రారంభానికి సిద్ధంగా 38 బడులు
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలల్లో 38 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఏడువేల మందికి పింఛన్లు ఇస్తుండగా.. మరో 15 వేల పింఛన్లు కొత్తగా మంజూరైనట్లు గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారులు జడ్పీచైర్‌పర్సన్‌కు వివరించారు. బ్యాంకు లింకేజీ ద్వారా రూ.865 కోట్లకుగాను రూ. 666.75 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళలకు అందించామని..మిగిలిన వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు.
పీఎంఎఫ్ఎస్ ద్వారా 161 కొత్త యూనిట్లు మంజూరు కాగా వాటిలో 100 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు 8,945 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2,964 మందిని అర్హులుగా ఎంపిక చేసినట్లు అధికారులు వివరించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా పౌల్ట్రీ, డెయిరీ ఫామ్, సెరికల్చర్, ఫిషరీస్ పరిశ్రమలకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని ఔత్సాహికులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
కడ్తాల్ మండలంలో ఎక్సో ఫ్యాబ్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉందని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ చైర్పర్సన్ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. సంబంధిత కంట్రోల్ బోర్డు ఇంజినీరింగ్ అధికారి గైర్హాజరు కావడంతో వారికి ఫోన్ చేసి ఆమె మండిపడ్డారు. అనంతరం, జడ్పీటీసీలు తెలిపిన పలు సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశం లో జడ్పీటీసీలు మహిపాల్, దశరథ్ నాయక్, కో-ఆప్షన్ సభ్యులు అలీ అక్బర్ ఖాన్, శ్రీలత, జంగమ్మ, వెంకట్రామ్రెడ్డి, సీఈవో దిలీప్ కుమార్, డిప్యూటీ సీఈవో రంగారావు పాల్గొన్నారు.