బంట్వారం/కోట్పల్లి, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది మండలంలోని అనేక గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 5,00,000 నుంచి 10,00,000లతో సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. వాటిని నాణ్యతాప్రమాణాలు పాటించక వేయడంతో వేసిన మూడు నెలలకే బీటలు వారాయి. మరో రెండు నెలలు దాటగానే పగుళ్లు వచ్చాయి. ఇలా ఏడాది కూడా పూర్తి కాలేదు రోడ్లన్నీ పగిలిపోతున్నాయి. ఇందుకు నిదర్శనం మండలంలోని మద్వాపూర్ గ్రామం.
ఈ ఊరిలో సీసీ రోడ్డు వేసిన కొన్ని నెలలకే దానిపై పగుళ్లు వచ్చాయి. వాహనాలు వెళ్తుండడంతో పూర్తిగా ధ్వంసమవుతుండడంతో స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసిన మూడు నెలలకే రోడ్డు పగిలిపోతే క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఏమి చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కాంట్రా క్టర్లపై చర్యలు తీసుకోక వారికే వత్తాసు పలకడం గమనార్హం.