షాబాద్, ఏప్రిల్ 10 : దేశాన్ని మతోన్మాద వాదుల నుంచి కాపాడుకుందామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు గురువారం షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర చేపట్టిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రశ్నించే నాయకుల మీద దాడులు, హత్యలు జరుగుతున్నాయని, ఇది ఫాసిస్టు విధానాలకు దారి తీస్తుందని మండిపడ్డారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వామపక్ష నాయకుల మీద దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండానే వక్ఫ్‌బోర్డు చట్టాలను సవరణ చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చి, దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపడం బాధకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ హటావో…దేశ్‌కు బచావో అనే పద్ధతిలో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నక్కలి జంగయ్య, నాయకులు శ్రీశైలం, రఘురాం, రుక్కయ్య, రఘు, మధు, మల్లయ్య తదితరులున్నారు.